డబ్బే నాకు ముఖ్యం…సిగ్గూ,లజ్జా !!


అయితే విచిత్రమేమిటంటే ఏసీబీకి అడ్డంగా దొరికిపోయినా పాత్రికేయులు ఫొటోలు, వీడియోలు తీస్తున్నా డీఎఫ్‌వో రమణమూర్తి మాత్రం అసలేమీ జరగనట్లు, తనకేమీ తెలియనట్లు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. గతంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌గా పనిచేసే సమయంలో ఆయన ఏసీబీకి చిక్కినట్లుగా సమాచారం….

అవినీతి ‘కొండ’
రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డీఎఫ్‌వో
బడిదేవర కొండపై అనుకూలంగా నివేదికిచ్చేందుకు డిమాండ్‌
దాదాపు పది రోజులుగా సాగుతున్న బేరసారాలు
సహనం నశించి పట్టిచ్చిన ఎంఎస్‌ఎన్‌ గ్రానైట్స్‌ యజమాని
viz-top1a

ఏం జరిగింది: విజయవాడకు చెందిన సెంట్రల్‌ విజిలెన్స్‌ బృందం దాడులు చేసింది.
పట్టుబడిందెవరు: జిల్లా అటవీశాఖాధికారి రమణమూర్తి
ఏం దొరికింది : రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఎప్పుడు: గురువారం సాయంత్రం 6 గంటలకు
ఎక్కడ: విజయనగరం పట్టణంలోని ఎస్‌వీఎన్‌ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని రమణమూర్తి ఇంట్లోనే
లంచం దేనికి: బడిదేవరకొండపై అనుకూల నివేదిక ఇవ్వడానికి ఎంఎస్‌పీ గ్రానైట్స్‌ యజమాని పళనివేల్‌ నుంచి రూ.25 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. తొలివిడతగా వెంటనే రూ.5 లక్షలు ఇచ్చి తీరాలన్నారు.

డిదేవరకొండ.. చాలా కాలంగా జిల్లావాసులందరి నోట్లోనూ నానుతున్న పేరు. ఇదే కొండపై గ్రానైట్‌ క్వారీకి అనుకూల నివేదిక ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా అటవీశాఖాధికారి రమణమూర్తి గురువారం సాయంత్రం విజయనగరం పట్టణంలోని ఎస్‌వీఎన్‌ నగర్‌లోని తన ఇంట్లో ఏసీబీకి దొరికిపోయారు. విజయవాడకు చెందిన ఏసీబీ సెంట్రల్‌ విజిలెన్స్‌ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో దాడులు జరిగాయి. బాధితుడు పళనివేల్‌ రూ.5 లక్షలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ సీఐలు వి.సతీష్‌కుమార్‌, వి.సుదర్శన్‌రావు, గఫూర్‌, ఎస్‌ఐ విష్ణు దాడుల్లో పాల్గొన్నారు. అయితే విచిత్రమేమిటంటే ఏసీబీకి అడ్డంగా దొరికిపోయినా పాత్రికేయులు ఫొటోలు, వీడియోలు తీస్తున్నా డీఎఫ్‌వో రమణమూర్తి మాత్రం అసలేమీ జరగనట్లు, తనకేమీ తెలియనట్లు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. గతంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌గా పనిచేసే సమయంలో ఆయన ఏసీబీకి చిక్కినట్లుగా సమాచారం. అప్పట్లో ఆ కేసు కారణంగా రెండేళ్ల పాటు పదోన్నతి సైతం దక్కలేదని తెలుస్తుంది. తరువాత కేసు కొట్టించేసుకుని తిరిగి ఉద్యోగంలో చేరినట్లుగా ఆరోపణలున్నాయి.తాజాగా ఏసీబీ దాడులకు కారణాల్లోకి వెళితే పార్వతీపురం మండలం కె.ములగ పంచాయతీకి చెందిన బడిదేవరకొండ సమీపంలోనే 16.56 ఎకరాల భూమిలో గ్రానైట్‌ తవ్వుకునేందుకు చెన్నైకి చెందిన ఎంఎస్‌పీ గ్రానైట్స్‌ సంస్థ గతంలోనే అనుమతులు తెచ్చుకుంది. అయితే సదరు భూములన్నీ రిజర్వ్‌ ఫారెస్ట్‌కి చెందినవంటూ డీఎఫ్‌వో రమణమూర్తి చాలాకాలంగా అక్కడ పనుల్ని జరగనివ్వడం లేదు. అదే విషయాన్ని ఆయన మీడియాకు సైతం చెబుతున్నారు. అయితే తమకు సకల అనుమతులూ ఉన్నాయని, అవి అటవీ భూములు కాదంటూ ఎంఎస్‌పీ సంస్థ యాజమాన్యం వాదిస్తుంది. అక్కడ కొండపైకి వెళ్లేందుకు రహదారి నిర్మాణాన్ని సైతం ప్రారంభించింది. అయితే అటవీశాఖ సిబ్బంది నిత్యం వెళ్లడం, అక్కడ పనుల్ని నిలిపేయడం జరుగుతుంది. కనీసం అవి అటవీ భూములేనని రాతపూర్వకంగా కావాలని కోరినా డీఎఫ్‌వోని కోరినా ఇవ్వకపోవడంతో ఏదొకటి తేల్చాలంటూ ఆయన కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ను కోరారు.

జడ్పీ సమావేశంలోనే ఆదేశం
బడిదేవరకొండపై ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలోనూ రగడ జరిగింది.సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సైతం భూములెవరివో నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. దీంతో పార్వతీపురం ఆర్డీవో గోవిందరావు, గనులశాఖ ఏడీ సాయిరామ్‌, డీఎఫ్‌వో రమణమూర్తి, జిల్లా సర్వే శాఖ ఏడీ గోపాలరావులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని రీసర్వే చేయమని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు. అవి అటవీశాఖ భూములా లేక రెవెన్యూ భూములా అన్నది తేల్చి నివేదిక ఇవ్వమన్నారు. గత నెల 29వ తేదీన బడిదేవర కొండపైకి వెళ్లి సదరు బృందం సర్వే చేశారు. కలెక్టరుకు ఇంకా నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో డీఎఫ్‌వో రమణమూర్తి తనకు రూ.25 లక్షలు లంచం ఇస్తే అనుకూలంగా నివేదిక ఇస్తానని, లేదంటూ అవి రిజర్వ్‌ఫారెస్ట్‌ భూములేనంటూ రాసేస్తానంటూ ఎంఎస్‌పీ గ్రానైట్స్‌ యజమాని పళనివేల్‌ని బెదిరించడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు.

పది రోజులుగా డిమాండ్‌
బాధితుడు పళనివేల్‌ చెబుతున్న ప్రకారం చాలారోజులగా అటవీశాఖ సిబ్బంది వెళ్లి పనులు నిలిపేయడమే కాకుండా డీఎఫ్‌వో రమణమూర్తిని కలవాలంటూ పదే పదే ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆయన డీఎఫ్‌వో రమణమూర్తిని కలిస్తే రూ.25 లక్షలు డిమాండ్‌ చేశారు. అయితే తాను అంత ఇచ్చుకోలేనని, ఇప్పటికే క్వారీ కోసం దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు పెట్టేశానని ప్రాధేయపడ్డారు. అయినా రమణమూర్తి బేరసారాలు సాగిస్తూనే ఉన్నారు. ఇంతలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశాలతో రీసర్వే సైతం జరిగింది. దాంతో మరోసారి నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే కచ్చితంగా డబ్బులివ్వాల్సిందేననడంతో పళనివేల్‌ ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. దీంతో రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకోగా గురువారం ఎట్టి పరిస్థితుల్లోను ముందుగా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డబ్బులిస్తే వెంటనే కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కు అవి రెవెన్యూ భూములేనని నివేదిక ఇచ్చేస్తానని చెప్పారు. దీంతో విజయవాడ నుంచి వచ్చిన సెంట్రల్‌ ఏసీబీ అధికారులతో తీసుకుని ఆయన రమణమూర్తి ఇంటికి వెళ్లారు. పళనివేల్‌ నుంచి డీఎఫ్‌వో రమణమూర్తి డబ్బులు తీసుకుంటుండగా బయట మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లా అటవీశాఖ కార్యాలయంలోని రమణమూర్తికి సంబంధించిన రికార్డుల్ని సైతం సీజ్‌ చేశారు.

ఫిర్యాదు మేరకే వచ్చాం
ఎంఎస్‌పీ గ్రానైట్‌ యాజమాని పళనివేల్‌ని రూ.25 లక్షలు లంచం కోరారన్న ఫిర్యాదు మేరకే మేము దాడులకు వచ్చాం. రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా డీఎఫ్‌వో రమణమూర్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం.

– రమాదేవి, డిఎస్పీ, సెంట్రల్‌ విజిలెన్స్‌

రూ.25 లక్షలు అడిగారు
డీఎఫ్‌వో రమణమూర్తి కావాలనే వేధిస్తున్నారు. అవి రెవెన్యూ భూములేనని తనకు తెలుసని కాకపోతే రూ.25 లక్షలు ఇవ్వకపోతే అటవీశాఖ భూములేనంటూ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చేస్తానంటూ బెదిరించారు. అందుకే సహనం నశించి ఏసీబీని ఆశ్రయించాను.

– పళనివేల్‌, ఎంఎస్‌పీ గ్రానైట్స్‌ యజమాని
ప్రకటనలు

1 Comment

  1. అవినీతి పరుల్లో ఉన్న విచ్చలవిడితనం..తప్పు చేశామన్న అభిప్రాయం కానీ, ఏ మాత్రం భయం అనేది లేక పోవడం కానీ…ఈ దేశం ఎటు వెడుతుందో..?అన్న ఆందోళన ఆలోచించే వారికి కలుగుతుంది…అందు వల్లనే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది….ఎవరి పైనా బురద జల్లడం ఈ పోస్ట్ ఉద్దేశ్యం కాదు…గమనించగలరు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s