దేముడి కుటుంబం vs నీరజా రావ్!!


ధన వ్యామోహం మనుష్యుల్నిఎంత అనాగరికంగా తయారు చేసిందో చూస్తునే ఉన్నాం….
మీడియా పుణ్యమా అని సంపాధన కోసం ఎంతటి దిగజారుడు పనులు పెద్దలు చేస్తున్నారో వెలుగు లోనికి వస్తున్నాయ్..
మన రాష్ట్రంలో ఈ ధన దాహానికి పరాకాష్ట గా దేముడి కుటుంబం చేసిన దారుణాలు ఎన్నో వెలుగులోనికి వచ్చాయ్!వస్తూనే ఉన్నాయ్!!
(తర్వాతే కచారా కుటుంబం)…
అయినా ఆ కుటుంబం లొని…ఆ పార్టీ లోనికి, మన నేతలు క్యూలు కట్టి మరీ విరగబడి పోతున్నారు!!
అవును అవతలి వాళ్ళు ఎంత నీచ్ కమీన్ కుత్తేలయినా,మన నేతలకి కావలసింది అదే కాబట్టి…
సముద్రం లొ అలలు వచ్చినపుడల్లా….నీటికి నీరు వెనక్కు పోతే…చెత్తకి చెత్త ఓ పక్క పోగయి న్నట్టు…
ఆ పార్టీ అభిమానులు మడమ తిప్పని తమ అవినీతిని బహిరంగంగానే జై కొడుతూ ఉంటారు…
ఎదుటి పార్టీల అవినీతిని తవ్వి చూపిస్తారు…..వాడెవడో అవినీతి చేశాడు కాబట్టి మేమూ అవినీతికి పాల్పడ్డాం అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్ల సారాంశం కాబోలు…

ఇక నీరజా రావ్ లా ఎంత మంది పోరాడగలరు…
మీడియా వెనుక నిలబడ బట్టి…దేముడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి వీళ్ళు బ్రతికి బయట పడ్డారు కానీ…
ఈ సమాజంలో ఈ రాజకీయ నాయకుల నుండీ…వీళ్ళను గుడ్డిగా,పిచ్చిగా,మూర్ఖంగా భజన చేసే మన ప్రప్రప్రజాస్వామికుల నుండి ఎవర్ని రక్షించగలం?
ఈ దేశాన్ని ఈ రాజకీయ దేవ గూండాల నుండీ వీళ్ళ అభిమానుల నుంచీ ఎవరు రక్షించగలరు?

http://www.andhrajyothy.com/node/50907

నగరంలో భూమి కబ్జాకి గురయిందంటే యజమాని దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. అలాకాదు పోరాడతాం అంటే అందుకు ఎంతో ధైర్యం కావాలి. ఎటువంటి బెదిరింపులకు లొంగకూడదు. ప్రాణంపోయినా పర్వాలేదనుకుని బరిలోకి దిగాల్సి ఉంటుంది. అంతటి ధైర్యం ఎందరికి ఉంటుంది? నీరజారావు లాంటి వాళ్లకు ఉంటుంది. తమ కోసం తల్లిదండ్రులు కొన్న ఇంటిని దర్జాగా కబ్జా చేసిన వైఎస్ జగన్ మేనమామ పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఆ ఇంటిని కూలదోసి అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే అడ్డుపడి తన హక్కును కాపాడుకున్న ధీశాలి నీరజ. ఆమె మాటల్లోనే ఆ పోరాటం గురించి…

“మా నాన్నగారు 1990లో తన స్నేహితుడు కెజికె సుబ్రమణ్యం దగ్గర్నించి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబరు 2, ప్లాట్ నంబరు 10లోని 472 చదరపుగజాల స్థలాన్ని కొని జిపిఎ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. అందులో అప్పటికే 272 చదరపుగజాల స్థలంలో ఒక భవనం ఉంది. ఆ స్థలం మాకు అమ్మిన తరువాత కెజికె గారు దక్షిణాఫ్రికా వెళ్లిపోయారు. మేము అప్పట్లో హైదరాబాద్‌లోనే వేరే ప్రాంతంలో ఉండేవాళ్లం. మా నాన్న ఆ ఇల్లు కొన్నప్పుడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. లంబాడా వాళ్ల గుడిసెలు కొన్ని ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో ఆ స్థలం కొనడం అంటే ఒక గుడిసెను కొన్నట్టే. నాలుగేళ్ల తరువాత అంటే 1994లో బి. డి. స్టీఫెన్స్ అనే అతడ్ని వాచ్‌మాన్‌గా ఉంచారు నాన్న. అతడికి మా కుటుంబం గురించి, ఆ స్థలం జిపిఎలో ఉన్న విషయం గురించి తెలుసు. సంవత్సరం తరువాత చిన్న స్కూల్ పెట్టుకుంటానని అడిగాడతను. చుట్టూ ఉన్న లంబాడా పిల్లలు చదువుకుంటారని సరేనన్నారు అమ్మా వాళ్లు. దాంతో అతను ప్లే స్కూల్ లాంటిది పెట్టుకున్నాడు. ఆ స్కూల్‌కి ప్రిన్సిపాల్‌గా మారాక అతను తన పేరును ఇమాన్యుయేల్‌గా మార్చుకున్నాడట.

ఖాళీ చేయమంటే కేసు పెట్టాడు
1998లో నాన్న చనిపోయారు. దాంతో అమ్మ కెజికె గారిని పిలిపించి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయం స్టీఫెన్‌కి తెలియదు. ఆ తరువాత 2000 సంవత్సరంలో స్టీఫెన్‌ని ఖాళీ చేయమని అమ్మ అడిగింది. దానికి అతను ‘నేను చేయను’ అన్నాడు. అమ్మకి కోపం వచ్చి బాగా తిట్టింది. దాంతో ఖాళీ చేయమని దౌర్జన్యం చేస్తున్నారంటూ అమ్మ మీదే కేసు పెట్టాడతను. గట్టిగా అడిగితే మాట వినేట్టు లేడు. తనంతట తనే తెలుసుకుంటాడు. కొంత సమయం ఇచ్చి చూద్దామని 2003 వరకు ఆగింది అమ్మ. అయినప్పటికీ అతను కదలకపోవడంతో సివిల్ కోర్టులో కేసు వేసింది. ఆ తరువాత మూడేళ్లకు అమ్మ చనిపోయింది. ఆ కేసు జడ్జిమెంట్ 2008 జూన్‌లో వచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చేలోపు మా ఇద్దరు అన్నలకి “మేము వైఎస్సార్(వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి) తరఫు వాళ్లం. మీ భూమి గురించి మాట్లాడాలి. మీ భూమి మీద మాకు ఆసక్తి ఉంది” అని ఫోన్ కాల్స్ వచ్చాయి. దానికి మా వాళ్లు “కోర్టులో కేసు ఉంది. ప్రాపర్టీ లిటిగేషన్‌లో ఉంది. తీర్పు కూడా దగ్గరలోనే ఉంది. కాబట్టి దాని గురించి మేమేమీ మాట్లాడలేం” అని చెప్పారు. ఆ కాల్స్ నిజంగానే వైఎస్సార్ తరఫు వాళ్లు చేస్తున్నారని మేమనుకోలేదు. ఎవరో గల్లీ గూండాలు బెదిరించడానికి చేస్తున్నారనుకున్నాం.

బిల్డింగ్ బాగా కడుతున్నారే…
నెలకి నాలుగువేల రూపాయల అద్దె చొప్పున లక్షరూపాయలు కట్టాలని, మూడు నెలల్లో స్టీఫెన్ ఖాళీ చేయాలని, ఖాళీచేయకపోతే కోర్టు ఖాళీ చేయిస్తుందని తీర్పు వచ్చింది. అదే సమయంలో అన్నకి యాక్సిడెంట్ అయ్యి వెన్నెముక దెబ్బతిన్నది. ఆయన డయాబెటిక్ పేషెంట్ కూడా కావడంతో తీర్పు వచ్చినా చాలాకాలం పాటు ఆ వైపు వెళ్లలేదు మేము. నిజానికి తీర్పు రాగానే ‘దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు…’ అనే బోర్డు పెట్టుంటే పరిస్థితి ఎలా ఉండేదో గాని మా పరిస్థితుల వల్ల మేమలా చేయలేదు. 2010 ఫిబ్రవరి 1వ తేదీన చుట్టుపక్కల వాళ్లు ‘పెద్ద ఇల్లు కడుతున్నారే… బిల్డింగ్ చాలా బాగుంది’ అని ఫోన్ చేశారు. ‘మేము కట్టడం లేదే’ అన్నాం. దానికి వాళ్లు ‘అదేంటండీ మూడు ఫ్లోర్‌లు కట్టారుగా’ అనడంతో ఆశ్చర్యపోవడం మా వంతయింది. వెంటనే వెళ్లి చూశాం. మా స్థలంలో మాకు తెలియకుండా కడుతున్న భవనాన్ని చూసి ఆశ్యర్యపోయాం. పిల్లర్ల మీద 2008, సెప్టెంబర్ అని డేట్లు వేసి ఉన్నాయి. ఆ ఫోటోలు తీసి, ఫిబ్రవరి 2న ఇ.సి. తీసుకుని, మా ప్లాట్‌కి సంబంధించిన పేపర్లన్నీ తీసుకుని టౌన్‌ప్లానింగ్ అడిషనల్ కమిషనర్ ధనుంజయ్ రెడ్డికి, కమిషనర్ సమీర్ శర్మకి ‘మా ఇల్లు కూలగొట్టి అక్రమంగా భవనం నిర్మిస్తున్నారని’ ఫిిర్యాదు చేశాం. వాళ్లనుంచి ఎటువంటి స్పందన లేదు. దాంతో అప్పుడు కలెక్టర్‌గా ఉన్న నవీన్ మిట్టల్‌కు నేను, మా అన్నలు ఇద్దరు విడివిడిగా పిటిషన్లు ఇచ్చాం.

మేనమామకి అడ్డుపడతాడనుకుంటే…
అక్రమ కట్టడం నిర్మించేది వైఎస్సార్ బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఫలితం ఉండొచ్చు అనుకున్నాను. ఆయన అపాయింట్‌మెంట్ కోసం సాక్షి సి.ఇ.ఓ. ప్రియదర్శిని రామ్‌ని కలిశాను. ఆయన జగన్మోహన్‌రెడ్డి గారితో అపాయింట్‌మెంట్ ఇప్పించారు. సాగర్ సొసైటీలోని ఇంట్లోనే జగన్‌ని కలిశాను. ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నారక్కడ.(నేనాయన్ని కలిసినట్టు వాళ్లే సాక్ష్యం.) ఆయన ఖాళీ అయ్యేసరికి రాత్రి పావుతక్కువ పదకొండు అయ్యింది. “మీ పేరు దుర్వినియోగం చేస్తున్నారు. మా ఇల్లు కూలగొట్టి బిల్డింగ్ కడుతున్నారు. మీ మామ రవీంద్రనాథ్ రెడ్డి ఆ పనిచేస్తున్నారట. మీ బావ బ్రదర్ అనిల్ ఆ బిల్డింగ్‌లో చర్చి పెడతారని చెప్తున్నారు. మీరే మాకు న్యాయం చేయాలి” అని ఆయనతోనే అన్ని విషయాలు నేరుగా చెప్పాను. అంతా విన్నాక జగన్ లేచి సునీల్ రెడ్డి అనే ఆయన్ని పిలిపించాడు. ‘ఈయన మా కజిన్’ అని నాకు పరిచయం చేసి అతనితో ‘ధనుంజయ్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడు. ఈవిడకి న్యాయం జరగాలి’ అని చెప్పాడు. ధనుంజయ్ రెడ్డిని కలిస్తే రెండు రోజులు టైం ఇవ్వమన్నాడు. ఆ తరువాత వెళ్లి అడిగితే ‘మా ఎంక్వైరీ గురించి నీకు చెప్పను. చెప్పాల్సిన పనిలేద’న్నాడు. ఆ తరువాత కలిసినా ఏం లాభం లేకపోయింది. ఐదు రోజుల తరువాత జగన్ దగ్గరకి మళ్లీ వెళ్లాను. ఆయన మళ్లీ సునీల్ రెడ్డిని పిలిచి చీవాట్లు పెట్టాడు. మళ్లీ ధనుంజయ్‌రెడ్డిని కలవమన్నాడు. ఆయన ఆఫీసుకి రోజూ వెళ్లడం, అతనేమో ఏదో ఒక వంక చెప్పి నన్ను రోజూ తిప్పడం… ఇలా జరిగింది.

వర్తించని జీవో అడ్డుపెట్టుకుని
ఎలాగైతేనేం హోలీ పండగ మరుసటి రోజు ఆయన్ని కలిశాను. జీవో 166 ప్రకారం క్రమబద్ధీకరణ జరిగిపోయిందన్నాడు. అప్పటి కలెక్టర్ నవీన్ మిట్టల్ వర్తించని జీవో అడ్డుపెట్టుకుని రాత్రికి రాత్రి ఎర్రగడ్డ రిజిస్టర్ ఆఫీసులో ఈ తతంగమంతా పూర్తి చేయించేసుకున్నారు. ఇదేంటని అడిగితే …”జిహెచ్ఎమ్‌సి మీద కేసు వేసుకో. నేనేం చేయలేన”ని చేతులెత్తేశాడాయన. మళ్లీ జగన్ దగ్గరికి వెళ్లాను. “మీ మామ మా ప్లాట్‌ని ఆక్రమించుకున్నాడని మీకు తెలుసు, నాకు తెలుసు. అదిప్పుడు క్రమబద్ధీకరణ కూడా జరిగింది” అని నేను చెప్పగానే “భూమికి సంబంధించిన విషయాలు నాకు తెలియదు” అన్నాడాయన. “ఇవన్నీ కాదు. మీరు ఇప్పిస్తారా లేదా” అని అడిగితే “సునీల్ రెడ్డితో మాట్లాడండి” అనేది జగన్ సమాధానం. మరుసటిరోజు సునీల్‌రెడ్డి ఇంటికెళ్లాను. “జగన్ చెయ్యాల్సింది చేశాడు. మీ లీగల్ ఆప్షన్స్ మీరు చూసుకోండి” అన్నాడు. నేను మీకు ఫాలోఅప్ చెప్పేనా అని అడిగాను. అప్పుడాయన నాతో “జీవితంలో వెనక్కి తిరిగి చూడొద్దు. ముందుకు సాగిపోవాలి” అని చెప్పాడు. ఒకరకంగా నా పోరాటానికి ‘లీగల్ ఆప్షన్’ అనే దారి వాళ్లే చూపారు (వ్యంగ్యంగా).

సూయిసైడ్ మిషన్
ఇక ఇలాగయితే లాభం లేదనుకుని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. సూయిసైడ్ మిషన్ అనుకున్నాను. అధికారం, డబ్బు ఉంటే సామాన్యుడ్ని బతకనీయరా అనే ఆలోచన నన్ను ముందుకు నడిపింది. సమాచార హక్కు చట్టం కింద మా ప్లాట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకున్నాను. అసలు అన్యాయం ఎలా జరిగింది? అనేది తెలుసుకున్నాను. నవీన్ మిట్టల్‌తో కలుపుకుని అధికార వ్యవస్థ అంతటికీ ఇందులో భాగముందనే విషయం తెలిసింది. దాంతో మా అన్నయ్య వాళ్లు నిరాశ పడి వెనక్కి తగ్గారు. కాని నేనలా అనుకోలేదు. మీరెవరూ నాకు సాయం రానక్కర్లేదు. నేనొక్కదాన్నే పోరాడతాను అని వాళ్లకు చెప్పాను. ఎలాగయినా న్యాయపోరాటం చేయాలని 2010 ఏప్రిల్ 17న ప్రెస్‌కాన్ఫరెన్స్ పెట్టి జర్నలిస్టులందరికీ డాక్యుమెంట్లు పంచాను. ఆంధ్రజ్యోతి నా పోరాటానికి ఎంతో సాయంగా నిలిచింది. ఎబిఎన్, టివి 9 చానళ్లతో పాటు ఈనాడు పత్రిక కూడా సాయపడింది. టిడిపి, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎమ్ పార్టీలు కూడా నా పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచాయి. చానళ్లు పత్రికలు నా మాట అందరికీ వినిపించాయి. విషయం సిఎం, స్పీకర్ల దృష్టికి వెళ్లింది. అప్పటి చీఫ్ సెక్రటరీ ఎస్.వి. ప్రసాద్‌గారు మా రిపోర్ట్సు చూసి వెంటనే విచారణకి ఆదేశించారు. కలెక్టర్ గుల్జార్, స్మితా సభర్వాల్, ఎమ్మార్వో రఘురామ్ శర్మలు అప్పటివరకు జరిగిన అవకతవకల గురించి నివేదికలు ఇచ్చారు. అలా మా భూమి పై జరిగిన క్రమబద్ధీకరణను 2011 జులై 26న రద్దుచేశారు. అలాగని మేం సంతోషించేంతలోనే ప్రభుత్వ ప్లీడర్ రమేష్ సాయంతో దాని మీద కూడా స్టే తెచ్చుకున్నారు వాళ్లు. ఈ రమేష్ కెవిపి మేనల్లుడు. కాని అప్పటి ప్రిన్సిపల్ సెక్రెటరి అనిల్ చంద్ర పునెతా, గుల్జార్ గారు కౌంటర్ ఫైల్ చేసి ఈ కేసును అడ్వకేట్ జనరల్‌కి అప్పగించారు.

జిహెచ్ఎమ్‌సి కమిషనర్ కృష్ణబాబు గారిని కలిసి పిటిషన్ ఇచ్చాను. తప్పుడు డాక్యుమెంట్లన్నీ అప్పుడు బయటికి వచ్చాయి. క్రమబద్ధీకరణ గురించి ధనుంజయ్ రెడ్డి ఫైల్ పంపినప్పటికీ, అప్పటి జిహెచ్ఎమ్‌సి స్టాండింగ్ కౌన్సిల్‌లో ఉన్న కల్పనా బోటె గారు ఫైల్ సరిగా లేదని తిప్పి పంపారనే విషయం తెలిసింది.జిహెచ్ఎమ్‌సి నుంచి కబ్జాదారులకి షోకాజ్ నోటీసుతో పాటు కట్టడం కూల్చివేతకు సంబంధించిన నోటీసులు పంపారు. అయితే షోకాజ్ నోటీస్ మీద స్టే తెచ్చుకున్నారు వాళ్లు. దీనికి వాళ్లు అక్కడ పనిచేసే ప్యూన్లను వాడుకున్నారు. వాళ్ల ద్వారా కేసును స్టాండింగ్ కౌన్సిల్‌లో ఉన్న పద్మావతి గారి టేబుల్ మీదకి కాకుండా వేరే టేబుల్ మీదకి చేర్చేలా చేశారు. మోసంతో స్టే తెచ్చుకోగలిగారు. కాని మరుసటి రోజు విషయం ఆవిడకి తెలిసి రిట్ తీయించేశారు. అక్రమ కట్టడం కూల్చివేతకు సంబంధించిన నోటీస్ ఇస్తే దానిపై మళ్లీ పిటిషన్ వేయించారు. ఆ కేసు 2013 జూన్ 19 నుంచి డిసెంబర్ 27 వరకు నడిచిన తరువాత మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

బెదిరించారు భయపెట్టారు
ఈ పోరాటంలో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నాను. చంపేస్తామన్నారు. చావంటే భయపడే వాళ్లను పోరాటం నుంచి తప్పించగలరేమో గాని నాలాంటి వాళ్లను కాదు. ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నారు. నా ఫోన్ టాప్ చేస్తున్నారని తెలిసినా నంబర్ మార్చుకోలేదు. నన్ను ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకి రెట్టింపు కసి పెరిగింది నాలో. నా ఈ పయనంలో హరివంశరాయ్ బచ్చన్ ‘అగ్నిపథ్’, మజ్రూసుల్తాన్ పురి ‘మై అకేలా..’, దుష్యంత్‌కుమార్ ‘కౌన్ కెహతాహై’, షహీద్ రాంప్రసాద్ ‘ఘర్ సే చాంద్ కే చల్’ కవితలు నా వెంటే నిలిచి నా పోరాటానికి ఊపిరి పోశాయి. భగవద్గీత, ఆదిశంకరాచార్యుల ‘వివేక చూడామణి’, భజగోవిందం అండగా నిలిచాయి. ఒంటరి స్త్రీ సాయం కోసం బయటకు వెళ్తే ఎలాంటి చూపులు విసురుతారో మీకు తెలుసు. వాటినుంచి నన్ను నేను రక్షించుకోవడం కోసం ఆత్మవిశ్వాసం అనే వస్త్రాన్ని ధరించాను.

నా పోరాటాన్ని ప్రారంభంలో ప్రచారం కోసం చేస్తున్నాను అన్నారు. తరువాత లాజిక్కులు మాట్లాడుతోంది తప్పకుండా డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంది అన్నారు. ఆ తరువాత ఈవిడ తప్పకుండా రాజకీయాల్లో చేరుతుంది అంటున్నారు. కాని సామాన్యురాలిగా నా హక్కు కోసం చేసిన పోరాటం ఇది. రాజ్యాంగం ప్రకారం సామాన్యుడికి ఉన్న పౌరహక్కులు, చట్ట పరమైన హక్కుల గురించి పోరాడాను. నేను ఉద్యోగం చేసి దాచుకున్న డబ్బుతో జీవనం కొనసాగిస్తున్నాను. వెనకడుగు వేయకుండా న్యాయం కోసం చేసిన ఈ పనిలో అవినీతికి పాల్పడిన వాళ్లు న్యాయపరమైన నా హక్కులకి, నిజాయితీకి భయపడ్డారు. ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడితే న్యాయానిదే గెలుపనేది కళ్ల ముందు నిలిచిన వాస్తవం.”
ం కిరణ్మయి

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s