చాక్చి…కధనాలు ..జ్యోతి వారి ఖండన…


ఈ వార్త నిజమే.. అనిపించే నేర్పున్నజర్నలిస్ట్లు…….నాలుగు పైసలకు కక్కుర్తి పడి వండి వారుస్తున్న…..వార్తలు అప్పుడప్పుడు విశ్లేషించకుండా..ఉండలేం…
అవతలి వాళ్ళు ఉద్దరించారని కాదు గానీ…వాళ్ళను మించిన చండాలం తయారు చేయడమే విచారకరం…
వెర్రి పువ్వు జనంతో ..ఎవడు తినలేదనిపించేలా కుక్క బిస్కెట్లు పడేసి
భూమ్మీద ఉన్న ప్రతి వాడూ ఈర్ష్య పడేంత సొమ్ము నాలుగేళ్ళలో పోగేసుకుని….
ఒక గ్రూప్ జనాల మీద కక్ష..ను సద్వినియోగం చేసుకున్న…మన జగన్ రెడ్డి…పేపర్ పెట్టి…ఆంద్రా జర్నలిజాన్ని చండాలాన్ని శిఖరానికి చేర్చాడు…

sakshi daily..28/11/12

కోర్టు ధిక్కరణ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ వేమూరి రాధాకృష్ణ అనుసరించిన తీరును హైకోర్టు ఎండగట్టింది. కేసును వినకుండా చేసేందుకు ‘నాట్‌బిఫోర్’ నాటకానికి తెరలేపడంపై మండిపడింది. నీతిబాహ్యమైన ఇలాంటి పనులెందుకంటూ మంగళవారం నిలదీసింది. ‘నాట్‌బిఫోర్’లతో వ్యవస్థను ఎక్కడికి తీసుకెళుతున్నారంటూ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు వ్యవస్థకు ఎంత మాత్రం మేలు చేసేవి కావని వ్యాఖ్యానించారు. అంతేకాక రాధాకృష్ణ ‘నాట్‌బిఫోర్’ నాటకంలో పాలుపంచుకున్న, ఒకప్పుడు తన వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేసిన ఎం.కృష్ణారావుపై కూడా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదేనా నువ్వు నేర్చుకున్నదంటూ అసహనం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం కోర్టు ధిక్కరణ కేసును తానే విచారించాల్సి ఉన్నప్పటికీ.. రాధాకృష్ణ తరఫున తన వద్ద జూనియర్‌గా పనిచేసిన న్యాయవాది వకాలత్ దాఖలు చేయడంతో నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ రామ్మోహనరావు తప్పుకున్నారు. ఈ కేసును మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా సంబంధిత రికార్డులన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

కేబుల్ టీవీ నెట్‌వర్క్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో కుమ్మక్కై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆ చానెల్‌పై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గత ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రతిష్టను దెబ్బతిసే విధంగా ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా ఏబీఎన్ చానెల్‌ను ఆదేశించాలని కోరారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇటీవల ఆ చానెల్ తమ పార్టీతో పాటు, పార్టీ నాయకుల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తోందని, ఇది కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని, అందువల్ల ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ అంబటి రాంబాబు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ రామ్మోహనరావు ఇటీవల ఈ వ్యాజ్యాన్ని విచారించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దన్న ఆదేశాలను ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలంటూ రాధాకృష్ణకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. దీంతో మంగళవారం కేసు విచారణకు వచ్చింది. అయితే న్యాయమూర్తి… తను న్యాయవాదిగా ఉన్న సమయంలో తన వద్ద జూనియర్‌గా పనిచేసిన ఎం.కృష్ణారావు.. రాధాకృష్ణ తరఫున వకాలత్ దాఖలు చేసిన విషయాన్ని గమనించారు. ఈ కేసును తాను విచారించకుండా చేసేందుకే రాధాకృష్ణ ఈ ‘నాట్‌బిఫోర్’ నాటకానికి తెరలేపారన్న విషయం ఆయనకు అర్థమైంది. కేసును వినకుండా చేసేందుకు ఇటువంటి చౌకబారుపనులకు పాల్పడాల్సిన అవసరం ఏముందని అటు కృష్ణారావును, ఇటు రాధాకృష్ణను సూటిగా ప్రశ్నించారు.‘ నీ చేత ఈ వకాలత్ దాఖలు చేయించిన ఆ వ్యక్తికి నేను బాగా తెలుసు.

ఈ కేసు నేను వినడం వల్ల తనకు ఇబ్బందులు వస్తాయని ఆ వ్యక్తి భావించి ఉంటే, నేరుగా కోర్టుకు వచ్చి ధైర్యంగా ఆ విషయాన్ని నాకే చెప్పి ఉండాల్సింది. అలా ధైర్యంగా చెప్పి ఉంటే ఈ కేసు విచారణ నుంచి నేను తప్పుకుని ఉండేవాడిని. కానీ ఇలాంటి నీతిబాహ్యమైన, చౌకబారు పనులకు పాల్పడాల్సిన అవసరం లేదు’ అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు.

టీడీపీ బాటలోనే రాధాకృష్ణ!: ‘నాట్‌బిఫోర్’ అనే మాటకు వాస్తవంగా ఇటీవలి కాలం వరకు చాలామందికి అర్థం తెలియదు. అలాంటి పదాన్ని సామాన్యులకు సైతం పరిచయం చేసిన ఘనత టీడీపీ నాయకులకు దక్కుతుంది. ప్రతి న్యాయమూర్తి.. తాను న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, నైతిక విలువల్లో భాగంగా తన వద్ద జూనియర్‌గా పనిచేసిన న్యాయవాదుల కేసులను తన ముందు విచారణకు వేయవద్దంటూ.. సంబంధిత జూనియర్ న్యాయవాదుల జాబితాను రిజిస్ట్రీకి ఇస్తారు. ఆ జాబితాను నాట్ బిఫోర్ లిస్ట్ అంటారు. ఆ జాబితాలోని న్యాయవాదులు దాఖలు చేసే కేసులు.. సంబంధిత న్యాయమూర్తి ముందుకు రాకుండా రిజిస్ట్రీ చర్యలు తీసుకుంటుంది.

కాగా కొద్దికాలం క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన బినామీల అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహనరావులతో కూడిన ధర్మాసనం.. సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో కంగుతిన్న టీడీపీ నాయకులు నాట్ బిఫోర్ నాటకాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసును తిరిగి హైకోర్టు విచారణకు చేపట్టినప్పుడు.. కేసు తిరిగి జస్టిస్ రామ్మోహనరావు సభ్యుడిగా ఉన్న ధర్మాసనం ముందుకు రాకుండా ఉండేందుకు, ఆయన వద్ద జూనియర్‌గా పనిచేసిన ఓ న్యాయవాది చేత వకాలత్ దాఖలు చేయించారు. తద్వారా ఆ కేసు ఆయన వద్దకు రాకుండా చేయడంలో విజయం సాధించారు. అదే విధంగా తమకు అనుకూలంగా లేని న్యాయమూర్తుల వద్ద నాట్ బిఫోర్ నాటకాన్ని అమలు చేశారు. దీంతో ఈ కేసు హైకోర్టులోని ధర్మాసనాలన్నింటినీ తప్పించుకుంది. చివరకు విచారణ నిమిత్తం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని ప్రధాన న్యాయమూర్తికి కల్పించారు. ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తే, అందులో న్యాయమూర్తులుగా ఎవరుంటారనే విషయాన్ని ముందుగానే అంచనావేసి.. తదనుగుణంగా, వ్యూహాత్మకంగా అప్పట్లో నాట్ బిఫోర్ నాటకానికి తెరలేపారు. తద్వారా చంద్రబాబు అండ్ కో సీబీఐ దర్యాప్తు నుంచి తప్పించుకోగలిగారు.

తాజాగా రాధాకృష్ణ కూడా టీడీపీ నేతల బాటలోనే నడిచారు. హైకోర్టు ఉత్తర్వులను స్పష్టంగా ఉల్లంఘించడంతో ఈ కేసులో కోర్టు ధిక్కరణ కింద తనకు ఇబ్బందులు తప్పవని ఆయనకు అర్థమైంది. దీంతో బాబుకూ, తనకూ న్యాయవాదిగా ఉన్న వ్యక్తితో సంప్రదింపులు జరిపారు. ఇబ్బందులు తప్పించుకోవాలంటే నాట్ బిఫోర్ నాటకం ఒక్కటే శరణ్యమని ఆ వ్యక్తి రాధాకృష్ణకు తెలిపారు. దీంతో ఆయన నాట్‌బిఫోర్ నాటకానికి తెరలేపారు. జస్టిస్ రామ్మోహనరావు రిజిస్ట్రీకి సమర్పించిన నాట్ బిఫోర్ జాబితాను తెప్పించుకుని అందులో ఉన్న పేర్లను పరిశీలించారు. ఆ జాబితాలోని ఓ న్యాయవాదిని ఇప్పటికే ఓసారి ఉపయోగించుకుని ఉండటంతో అతన్ని వదిలేసి, మరో న్యాయవాది అయిన కృష్ణారావును పట్టుకున్నారు. ఆయనను ఒప్పించి రాధాకృష్ణ తరఫున వకాలత్ దాఖలు చేయించారు. కేసును జస్టిస్ రామ్మోహనరావు వినకుండా చేశారు.

ఆంధ్ర జ్యోతి వారి ఖండన..

నీతి బాహ్య రిపోర్టింగ్
హైకోర్టు సాక్షిగా జగన్ పత్రిక వక్రీకరణలు
న్యాయమూర్తి వ్యాఖ్యలకు సొంత జోడింపులు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీపై
కోర్టు ధిక్కరణ కేసులో చిలవలు పలవలు
అసలు తీర్పునే సవాల్ చేయని ఏబీఎన్
‘నాట్ బిఫోర్’ నాటకాలతో మాకేం పని!
హైదరాబాద్, నవంబర్ 28 : నీతి బాహ్యమైన విధానాలతో డబ్బులు పోగేసుకుని, నీతి బాహ్యమైన ఉద్దేశాలతో పత్రికను స్థాపించి, నీతి బాహ్యమైన వార్తలను ప్రతిరోజూ పేజీలకొద్దీ ప్రచురించే జగన్ పత్రిక… బుధవారం మరో నీతిబాహ్య కథనం ప్రచురించింది. దాని శీర్షిక పేరు… ‘ఎందుకీ నీతి బాహ్యమైన పనులు!’ హైకోర్టులో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు ఫలానా విధంగా మండిపడ్డారు, ఎండగట్టారు అంటూ ఓ వార్తను జగన్ పత్రిక ప్రచురించింది.

పవిత్రమైన న్యాయస్థానంలో, పదుగురు న్యాయవాదుల సమక్షంలో, పట్టపగలు జడ్జి చేసిన వ్యాఖ్యలనే వక్రీకరించింది. జడ్జి చెప్పింది చెప్పినట్లుగా కాకుండా… సొంత కవిత్వం జోడించింది. నీతి బాహ్యతకు నిలువెత్తు రూపమైన జగన్ పత్రికకు ఇది కొత్తేమీ కాదు. గతంలో అనేకసార్లు కోర్టుల్లో జరిగిన వాదోపవాదాలకు వక్ర భాష్యాలు చెప్పింది. గౌరవనీయ న్యాయమూర్తులకు సైతం ఉద్దేశాలు అంటగడుతూ అనేక కథనాలు వండి వార్చింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను కూడా వక్రీకరించిన చరిత్ర వారిది. తనకు బాగా అలవాటైన పనిని… మరోసారి మరింత అలవోకగా చేసేసింది.

‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విషయంలో న్యాయమూర్తి చెప్పింది గోరంత! జగన్ పత్రిక చిలవలు పలవలు చేసి ప్రచురించింది కొండంత! అసలు ఏం జరిగిందంటే… జగన్ పార్టీ నేత అంబటి రాంబాబు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ మంగళవారం జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు ముందు విచారణకు వచ్చింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ తరఫున కృష్ణారావు అనే న్యాయవాది వకాలత్ దాఖలు చేశారు.

కృష్ణారావు గతంలో తన వద్ద జూనియర్‌గా పని చేసి ఉండటంతో, జస్టిస్ నూతి రామ్మోహన్ రావు… ‘మీరెందుకు వచ్చారు? పిటిషన్ మీకు ఎలా వచ్చింది?’ అని ప్రశ్నించారు. తన కజిన్ రెఫరెన్స్ ద్వారా ఈ కేసు తన వద్దకు వచ్చిందని లాయర్ కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. “ఈ డిజైన్ అంతా ఎందుకు? నేను రెస్పాండెంట్‌కు తెలుసు. నాకు రెస్పాండెంట్ తెలుసు. ఐ డోన్ట్ వాన్ట్ టు హియర్ దిస్’ అని తెలిపారు. కేసును మరో ధర్మాసనానికి అప్పగించేలా ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

ఇదీ హైకోర్టులో జరిగింది! కానీ… దీనికి జగన్ పత్రిక అనేక నీతి బాహ్యమైన వ్యాఖ్యలు, అంశాలను జోడించి నాలుగు కాలాల పేద్ద వార్తను ప్రచురించింది. ‘నాట్ బిఫోర్’లతో వ్యవస్థను ఎక్కడికి తీసుకెళుతున్నారని జడ్జి తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారట! ఇటువంటి చర్యలు వ్యవస్థకు ఏ మాత్రం మేలు చేసేవి కావని వ్యాఖ్యానించారట! అంతేకాదు… “నీ చేత ఈ వకాలత్ దాఖలు చేయించిన వ్యక్తికి నేను బాగా తెలుసు.

ఈ కేసు నేను వినడం వల్ల తనకు ఇబ్బందులు వస్తాయని ఆ వ్యక్తి భావించి ఉంటే, నేరుగా కోర్టుకు వచ్చి ధైర్యంగా ఆ విషయాన్ని నాకే చెప్పి ఉండాల్సింది. అలా ధైర్యంగా చెప్పి ఉంటే ఈ కేసు విచారణ నుంచి నేనే తప్పుకొని ఉండే వాడిని. కానీ, ఇలాంటి నీతి బాహ్యమైన, చౌకబారు పనులకు పాల్పడాల్సిన అవసరం లేదు” అని జడ్జి పేర్కొన్నట్లుగా జగన్ పత్రిక రిపోర్టింగ్ చేసింది. గతంలో అనేక సందర్భాల్లో చేసినట్లే… ఇప్పుడూ జడ్జి వ్యాఖ్యలను వక్రీకరించింది.

ఎవరిది నీతి బాహ్యత?
‘నాట్ బిఫోర్’ వాడుకోవడం ‘జగన్ అండ్ కో’కు బాగా తెలిసిన విద్య. సుప్రీంకోర్టులో తన బెయిల్ పిటిషన్ జస్టిస్ జేఎస్ ఠాకూర్ ధర్మాసనం ముందుకు రాకుండా… ఆయనకు సంబంధించిన నాట్ బిఫోర్ జాబితాలోని సురేశ్ ఎ.ష్రాఫ్ అండ్ కంపెనీని జగన్ ఉపయోగించుకున్నారు. ఇలా ‘నాట్ బిఫోర్’ నాటకాల్లో సుప్రీంకోర్టు స్థాయిలోనే జగన్ ఆరి తేరారు. నిజానికి… ‘చంద్రబాబు అండ్ కో’ హైకోర్టులో నాట్ బిఫోర్‌ను ఉపయోగించుకున్నారన్న విజయమ్మ వాదనలతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించలేదు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను, ఆదేశాలను కూడా జగన్ పత్రిక అడ్డగోలుగా వక్రీకరించింది.

ఎందుకీ ధిక్కరణ?
జగన్ పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న అంబటి రాంబాబు ‘నీతి బాహ్యత’ను గత ఏడాది ‘ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. మహిళలతో ఆయన మాట్లాడే తీరును, ఆయనలోని రసికతను ‘ఆడియో’ సాక్షిగా బట్టబయలు చేసింది. దీంతో.. అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. జగన్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఎలాంటి కథనాలూ ప్రసారం చేయరాదని విన్నవించుకున్నారు. ఏబీఎన్ కథనాలతో బెంబేలెత్తిన ఆయన అలా పిటిషన్ వేసుకోవడంలో తప్పేమీ లేదు. దీనిపై హైకోర్టు పిటిషనర్‌కే కాక, వైఎస్ఆర్ పార్టీకి, ఆ పార్టీకి చెందిన నేతలకు కూడా వర్తించేలా ఆదేశాలు ఇచ్చింది. ‘డిఫమేటరీ’ కథనాలు ప్రసారం చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

నిర్దిష్టంగా ఒక అంశానికి సంబంధించిన వార్తలు ప్రసారం/ప్రచురణ చేయరాదంటూ కోర్టులు ఆదేశించిన ఉదంతాలూ సందర్భాలూ గతంలోనూ ఉన్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు! రాజ్ భవన్‌లో నాటి గవర్నర్ ఎన్డీ తివారీ రాసలీలలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ బయటపెట్టినప్పుడు… ఆయన ఆగమేఘాల మీద హైకోర్టును ఆశ్రయించారు. రాజ్‌భవన్‌కు, గవర్నర్ వ్యవస్థకు ఉన్న విలువ దృష్ట్యా… ఆ కథనం తదుపరి ప్రసారాన్ని నిలిపివేస్తూ హైకోర్టు అప్పట్లో ఆదేశించింది.

న్యాయ వ్యవస్థపట్ల ఉన్న గౌరవంతో ఆ ఆదేశాలను ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ తు.చ. తప్పకుండా పాటించింది. కానీ… ఏకంగా ఒక రాజకీయ పార్టీకి, ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఎలాంటి కథనాలు ప్రసారం చేయరాదన్న మధ్యంతర ఆదేశాలను ఎలా అర్థం చేసుకోవాలి? అదికూడా… సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం నుంచి సుప్రీంకోర్టు దాకా అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయకూడదన్న ఆదేశాలను ఎవరైనా ఎలా సమర్థించుకుంటారు? అయినా, ఏబీఎన్‌గానీ, ఆంధ్రజ్యోతి గానీ ఎలాగూ ‘డిఫమేటరీ’ కథనాలు ప్రసారం/ప్రచురణ చేయడంలేదు.

వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలు ఇస్తున్నాయి. అందువల్లనే, ఈ తీర్పును సవాలు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. తీర్పునే సవాలు చేసే ఆలోచన లేనప్పుడు, ‘నాట్ బిఫోర్’తో ఒక బెంచ్ ముందు నుంచి కేసు తప్పించాలనే ఆలోచన ఎందుకు వస్తుంది. ఒక కేసులో అందుబాటులో ఉన్న న్యాయవాదులను వినియోగించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. అసలు కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏ కేసు ఏ జడ్జి ముందుకు వస్తుందో కూడా ముందుగా తెలియదు.

అందువల్ల, నిర్దిష్టంగా ఒక న్యాయవాదిని ప్రత్యేకంగా వినియోగించుకోవడమన్న ప్రశ్నే తలెత్తదు. ఈ సందర్భంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎంచుకున్న న్యాయవాది యాథృచ్చికంగా జడ్జికి జూనియర్ అయి ఉండవచ్చు. దీనివల్ల, ‘నాట్ బిఫోర్’కు ప్రయత్నించామన్న అనుమానం జడ్జికి కలిగి ఉండవచ్చు. అంతే! ఫలానా న్యాయమూర్తిపైన నమ్మకం లేకపోతే ఈ విషయాన్ని ఆ జడ్జి ముందుకే వచ్చి చెప్పే ధైర్యం ‘ఆంధ్రజ్యోతి’కి ఉంది. నాట్ బిఫోర్ నాటకాలు జగన్ పార్టీకి తెలిసిన విద్య!

ప్రకటనలు

1 Comment

  1. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని సాక్షిలో పెట్టుబడులు పెట్టించారని సిబిఐ ఆరోపణ. ఇప్పుడు సిబిఐ చెబుతున్న విషయాలు ఈ రోజు కొత్తగా సిబిఐ పరిశోధించి కనుక్కున్నవేమీ కాదు. గత ఆరేళ్ల నుంచి ఈ విషయాలను ప్రధాన ప్రతిపక్షం ప్రతి రోజూ చెబుతున్నవే. ప్రధాన మంత్రికి, సోనియాగాంధీకి, వివిధ విచారణ సంస్థలకు ఈ వివరాలన్నీ టిడిపి ఆధారాలతో పాటు పుస్తకాలు అందజేసింది. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడే ఈ ఫిర్యాదులు చేశారు. వైఎస్‌ఆర్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అధికారం చలాయించింది కెవిపి రామచంద్రరావు. భారీ వ్యవహారాలన్నీ ఆయన సమక్షంలోనే జరిగేవి. కెవిపి సూట్‌కేసులను ఢిల్లీ హై కమాండ్‌కు అందజేస్తున్నారని టిడిపి పలు సార్లు ఆరోపించింది. సిబిఐ రాజకీయాలతో సంబంధం లేకుండా విచారణ జరిపితే మరి కెవిపిని విచారించాలి. వైఎస్‌ఆర్ కెవిపిని తన ఆత్మగా చెప్పుకున్నారు. ఆయన ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు కాబట్టి ఆయన్ని విచారించరు. రాష్ట్రం నుంచి నిధులు ఢిల్లీకి వెళ్లాయని, అందుకే సోనియాగాంధీ వైఎస్‌ఆర్ అక్రమాలపై వౌనంగా ఉన్నారు అని గతంలో టిడిపి ఆరోపించింది. సిబిఐ దీనిపై కనీసం విచారించింది. లేక కాంగ్రెస్ హై కమాండ్ అలా డబ్బులు తీసుకునే రకం కాదు,సచ్ఛీలమైనది అని సిబిఐ భావిస్తుంటే, అదే విషయాన్ని ప్రకటించాలి. జగన్ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చినప్పటి నుంచే అలా జరిగితే ఆయన ఆస్తులపై విచారణ జరిపిస్తారు అనే వార్తలు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్ నిజంగా అవినీతిపై యుద్ధం ప్రకటించాలనుకుంటే జగన్ పార్టీ వీడి బయటకు వెళ్లిన తరువాతనే ఆ పని చేయాలా? వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు, జగన్ కాంగ్రెస్‌లోనే ఉన్నప్పుడు వారి అవినీతి గుర్తుకు రాలేదా? అంటే పార్టీలో ఉంటే ఎలాంటి అవినీతికి పాల్పడినా పరవాలేదు. పార్టీ వీడి వెళితే సహించేది లేదు వెంటపడి వేటాడుతామని కాంగ్రెస్ చెప్పదలుచుకుందా? వివాదాస్పదమైన 26 జివోలను రద్దు చేయడం లేదు, ఆ జివోలకు సంబంధించిన మంత్రులను విచారించడం లేదు. మద్యం మాఫియాపై ఎసిబి నివేదికపై నోరు మెదపడం లేదు కానీ పార్టీ వీడి వెళ్లిన వారిపై మాత్రం యుద్ధం ప్రకటించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s