ఈ వార్త చదివాక మీకేమనిపిస్తోంది??


కేంద్రం సమర్పించు.. జగన్నాటకం!
*జగన్ బెయిల్‌కు పరోక్ష సహకారం
*సీబీఐ తరఫు లాయర్లకు స్థానభ్రంశం
*ఇద్దరు సీనియర్ల స్థానంలో ఒక్కరి నియామకం
*పెద్దగా అనుభవం లేని లాయర్‌కు వకాల్తా
*నేడు.. సుప్రీం ముందుకు బెయిల్ పిటిషన్
*అదే సమయంలో న్యాయవాదుల మార్పు
*కేసు నీరుగారుతుందని వాపోయిన సీబీఐ
*’ఒత్తిళ్లున్నాయి..తప్పదు’ అని చెప్పిన పెద్దలు
మరి కొన్ని గంటల్లో సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానున్న జగన్ బెయిల్ పిటిషన్! అంతలోనే… కేంద్రం సీబీఐకి షాక్ ఇచ్చింది! జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ తరఫున వాదిస్తున్న న్యాయవాదులను మార్చేసింది! ఇప్పటికిప్పుడు బాధ్యతలు చేపట్టిన కొత్త న్యాయవాది… శుక్రవారం సుప్రీంకోర్టులో సీబీఐ తరఫున వాదించనున్నారు! రాత్రికి రాత్రి ఆయన ఏం తెలుసుకుంటారు? జగన్ బెయిల్ పిటిషన్‌ను ఎలా తిప్పి కొడతారు? అసలు కేంద్రం ఆకస్మిక నిర్ణయానికి కారణమేమిటి? యూపీఏకే నా మద్దతు అని ‘ప్రత్యక్షంగా’ ప్రకటించిన జగన్‌కు కేంద్రం ‘పరోక్షంగా’ అందిస్తున్న సాయమా ఇది? బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్‌కు కలిసొచ్చేలా… సీబీఐకి షాకిచ్చేలా.. రంగు మారిన రాజకీయమా ఇది?

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 : మబ్బులు తొలగుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకే మా మద్దతు అని ‘ప్రత్యక్షంగా’ ప్రకటించిన వైఎస్ జగన్‌తో కేంద్రం ‘పరోక్షం’గా చేతులు కలిపినట్లే కనిపిస్తోంది. బెయిల్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ… కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్‌కు కేంద్రం తన వంతు సాయం ప్రకటించింది. పకడ్బందీ సాక్ష్యాలు, అఫిడవిట్లు, కౌంటర్లతో జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సీబీఐకి కేంద్రమే ముకుతాడు వేసింది.
ముక్కుసూటిగా వాదిస్తూ నిందితులను ముప్పుతిప్పలు పెడుతున్న సీబీఐ సీనియర్ న్యాయవాదులు… అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్, సీనియర్ న్యాయవాది అశోక్ భానులను జగన్ కేసు నుంచి తప్పించింది. వారి స్థానంలో కీలక కేసులు వాదించడంలో పెద్దగా అనుభవం లేని మోహన్ జైన్ ఒక్కరినే నియమించింది. ఈయన కూడా ప్రభుత్వ న్యాయవాదే. కానీ… క్రిమినల్ కేసులు వాదించిన అనుభవం లేదు. ఆర్థిక నేరాలపైనా ప్రత్యేక అవగాహన లేదని తెలుస్తోంది. మోహన్ జైన్ వాదించిన ఏకైక ప్రముఖ కేసు… ముళ్లపెరియార్ డ్యామ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘డ్యామ్ 999’ వివాదం ఒక్కటే! ఇప్పుడు… జగన్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ తరఫున వాదించనున్నారు.

ఎప్పటి నుంచో ఉన్నా…
హరేన్ రావల్, అశోక్ భాను సీబీఐకి ఆస్థాన వకీళ్లు. 2జీ నుంచి జగన్ కేసుదాకా సీబీఐ దర్యాప్తు చేపట్టిన అన్ని ప్రముఖ కేసుల్లోనూ వీరే లాయర్లు. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా జగన్‌కు వ్యతిరేకంగా సీబీఐ తరఫున వీరే వాదిస్తున్నారు. అయితే… కేంద్ర న్యాయశాఖ అనూహ్యంగా ఈ ఇద్దరినీ మార్చేసింది. హరేన్ రావల్ అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఉన్నప్పటికీ జగన్ కేసు నుంచి తప్పుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక… అశోక్ భాను ఈ కేసు వైపు తొంగి చూసే అవకాశం కూడా లేదు. కనీసం… ఎందుకో, ఏమిటో కూడా చెప్పకుండా జగన్ కేసు నుంచి వీరిని తప్పించింది.

ఈ మేరకు సొలిసిటర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… కేంద్రం నిర్ణయంతో సీబీఐ కంగుతింది. ఇప్పటికే నాలుగు చార్జిషీట్లు నమోదు చేసి, కేసు ముఖ్యమైన దశలో ఉన్న సమయంలో న్యాయవాదులను మార్చడం ఏమిటని ప్రశ్నించింది. ఇలాగైతే కేసులు నీరుగారిపోతాయని వాపోయింది. “ఇది చాలా సంక్లిష్టమైన కేసు. కుండమార్పిడి లావాదేవీలు, అల్లిబిల్లి కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఆరు ఇతర దేశాల వరకూ పాకిన ఆర్థిక అవకతవకలను అర్థం చేసుకుని, వాటిని వాదనల్లో బలంగా ప్రస్తావించడం మామూలు న్యాయవాదులకు సాధ్యం కాదు. ఇప్పుడు కొత్త న్యాయవాదులు వస్తే ఇవన్నీ అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది” అని కేంద్ర పెద్దలకు సీబీఐ వివరించింది.

ఈ వాదనలను కేంద్రం పట్టించుకోలేదు. న్యాయవాదులను మార్చాల్సిందేనంటూ… అన్నంత పనీ చేసింది. వారి స్థానంలో మోహన్ జైన్‌ను నియమించింది. ఆయనకు పెద్ద కేసులు వాదించిన అనుభవం లేదని, ఇలాంటి న్యాయవాదితో నెగ్గుకు రాలేమని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు వారు కేంద్ర న్యాయ శాఖకు లేఖాస్త్రం కూడా సంధించారు. అయితే… ‘పై స్థాయిలో ఒత్తిళ్లున్నాయి. ఈ విషయంలో నేనేమీ చేయలేను’ అని న్యాయ విభాగానికి చెందిన ప్రముఖుడొకరు సీబీఐకి మౌఖికంగా చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మాయావతి కేసులోనూ: గతంలో మాయావతి అక్రమాస్తుల కేసులోనూ యూపీఏ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. కేసు బలంగా ఉండి, సీబీఐ దూకుడుగా వెళుతున్న సమయంలో ప్రధాన న్యాయవాదిని మార్చేసింది. దీంతో ఆ కేసు నీరుగారిపోయిందని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఆ కేసు ఇప్పటికీ ‘నత్త నడకన’ నడుస్తుండటం విశేషం. కాంగ్రెస్ సర్కారు తనకు ఎదురుతిరిగిన రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, తనకు సలాం కొట్టిన వారిపై ఉన్న కేసుల్ని నీరుగార్చటం మొదటినుంచీ జరుగుతున్నదే అని విశ్లేషకులు అంటున్నారు.

ఇది మామూలే…
ప్రభుత్వ న్యాయవాదులను మార్చడం కొత్తేమీ కాదని, ఇది అక్రమం కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. “అందుబాటులో ఉన్న న్యాయవాదులను సీబీఐకి అందిస్తాం. ఏవైనా కారణాల వల్ల సంబంధిత న్యాయవాది అందుబాటులో లేకుంటే మరొకరు వారి స్థానంలో వాదిస్తుంటారు. ఇదేమీ కొత్తగా ఇప్పుడు పుట్టుకొచ్చిన విషయం కాదు” అని సమర్థించుకుంటున్నారు. కానీ.. న్యాయవాదులను మార్చిన సమయం మాత్రం అనుమానాలకు దారి తీస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పార్టీ యూపీఏ అభ్యర్థి అయిన ప్రణబ్‌కు మద్దతు పలికింది. ‘మతతత్వ పార్టీలకు దూరం’ పేరిట తమ మద్దతు యూపీఏకే అని జగన్ పరోక్షంగా తేల్చి చెప్పారు.

విలీనాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చకుండా ‘కాలమే నిర్ణయిస్తుంది’ అంటూ వైఎస్ విజయలక్ష్మి కాంగ్రెస్‌తో కలయికకు ద్వారం తెరిచే ఉంచారు. అటు… వైఎస్ పాదయాత్రల డైరీపై కేవీపీ రూపొందించిన పుస్తకం ఆవిష్కరణ సభకు కాంగ్రెస్ పెద్దలంతా తరలి వచ్చారు. వెరసి… కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య పైకి కనిపించని బంధమేదో బలపడుతోంది. కుమ్మక్కులో భాగంగానే ఇదంతా జరుగుతోందని టీడీపీ కూడా ఆరోపిస్తోంది. పైగా… జగన్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వస్తోంది. అదే సమయంలో… సీబీఐ లాయర్లను మార్చేడం గమనార్హం!

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s