జూన్ …2న హైకోర్టు తీర్పు…


స్వాధీనమే సరి!
అక్రమ సంపదకు అదే సరైన మందు
ఆర్థిక నేరాలను అణచివేయాల్సిందే
వీటితో దేశ ఆర్థిక చట్రం ధ్వంసం
అక్రమ సంపదను విద్య, వైద్యానికి మళ్లించాలి
పార్లమెంటే తగిన చట్టాలు చేయాలి
జస్టిస్ చంద్రకుమార్ సంచలన వ్యాఖ్యలు
జగన్‌ను కస్టడీకి అప్పగిస్తూ 2న హైకోర్టు తీర్పు
ఆకలి కేకలు.. ఆర్థిక నేరాలు
ఒకవైపు లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
మరోవైపు… తీవ్ర ఆర్థిక నేరాలతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలవుతోంది.
అక్రమ మార్గాల ద్వారా పోగేసుకున్న సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
ఆ సంపదను దేశ ప్రజల విద్య, వైద్య అవసరాలకు ఉపయోగించాలి.
ప్రశ్నలకు జవాబివ్వకుండా మౌనం దాల్చే హక్కు నిందితునికి ఉన్నట్లే…
వాస్తవాలను వెలికి తీయడానికి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే హక్కు సీబీఐకి ఉంది!
– జస్టిస్ చంద్రకుమార్

హైదరాబాద్, జూన్ 9 : ఆర్థిక నేరాలను ఉక్కుపాదంతో అణచి వేయాల్సిందేనని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అక్రమంగా పోగేసుకున్న సంపదను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. తన అరెస్టు అక్రమమంటూ జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ…. ఆయనను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ వినతిని మన్నిస్తూ ఈనెల 2న జారీ చేసిన ఉత్తర్వుల్లో జస్టిస్ చంద్ర కుమార్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు అనేకం చేశారు.

జగన్ తరఫు న్యాయవాదులు చేసిన వాదనల్లోని కొన్ని అంశాలతో ఏకీభవిస్తూనే…. ఆయనను కస్టడీకి అప్పగించాల్సిందే అని స్పష్టం చేశారు. “దేశ ఆర్థిక చట్రాన్ని ఆర్థిక నేరాలు విధ్వంసం చేస్తాయని మనం మరిచిపోవద్దు. ఇలాంటి నేరాలను ఉక్కుపాదంతో అణచి వేయాలి. ఈ కేసుల్లో సరైన, సక్రమమైన, నిజాయితీతో కూడిన… లోతైన దర్యాప్తు జరగాలి” అని జస్టిస్ చంద్ర కుమార్ పేర్కొన్నారు. ఆర్థిక నేరాల ద్వారా అక్రమంగా పోగేసుకున్న సంపద ఎక్కడ ఉన్నా వెలికితీయాల్సిందే అన్నారు. షేర్లు, కరెన్సీ, బంగారం, వజ్రాలు… ఇలా అక్రమ సంపద ఏ రూపంలో ఉన్నా దేశ ప్రయోజనాల రీత్యా దానిని జప్తు చేయాలన్నారు.

ఒకవైపు ఆకలి మంటలతో జనం అల్లాడుతుండగా… మరోవైపు ఆర్థిక నేరగాళ్లు వందలు, వేల కోట్ల రూపాయలు పోగేసుకుంటున్న వైనాన్ని కూడా ప్రస్తావించారు. “ఒకవైపు లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. లక్షలమంది యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. మరోవైపు… తీవ్ర ఆర్థిక నేరాలతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలవుతోంది” అని జస్టిస్ చంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆర్థిక నేరాలను సాధారణ నేరాలతో పోల్చలేమని తెలిపారు. ఇలాంటి నేరాలను ప్రత్యేకంగా చూడాల్సిందే అన్నారు. “కేంద్ర ప్రభుత్వం వీటిని తీవ్రంగా పరిగణించాలి.

అందుకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న చట్టాలను సవరించడంతోపాటు, అవసరమైతే కొత్త చట్టాలనూ చేయాలి” అని జడ్జి అభిప్రాయపడ్డారు. అక్రమ మార్గాల ద్వారా పోగేసుకున్న సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని… దానిని దేశ ప్రజల విద్య, ఆరోగ్యం వంటి అవసరాలకు ఉపయోగించాలని సూచించారు. ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలకు సమానమైన అవకాశాలు కల్పించాలనే వాదనతో ఏకీభవించారు. దర్యాప్తు కోసం తప్పనిసరిగా అవసరమనిపిస్తే మినహా… ఎవరినీ అనవసరంగా అరెస్టు చేయరాదని, వేధించరాదని స్పష్టం చేస్తూనే…. కేసు తీవ్రత దృష్ట్యా జగన్‌ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించవచ్చని జస్టిస్ చంద్ర కుమార్ స్పష్టం చేశారు.

అదే సమయంలో… కస్టడీలో నిందితులను హింసిస్తారనే అభిప్రాయాన్ని తొలగించేందుకు దర్యాప్తు సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ చంద్ర కుమార్ పేర్కొన్నారు. నిష్పాక్షికంగా, నిజాయితీగా దర్యాప్తు చేయాలని సీబీఐకి సూచించారు. ‘అక్రమ సంపాదనను ఏయే మార్గాల్లో మళ్లించారు? అది గమ్యస్థానానికి ఎలా చేరింది? ఈ గుట్టును సీబీఐ ఛేదించి తీరాలి’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నేతలకూ వారి బాధ్యతలను గుర్తు చేశారు. “సీబీఐ, ఏసీబీ వంటి సంస్థలు స్వతంత్రంగా, నిజాయితీగా పని చేసేలా చూడాల్సిన బాధ్యత మన ఘనమైన దేశ భవిష్యత్తును నిర్ణయించే నేతలపైనే ఉంది” అని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు.

బహుళ చార్జిషీట్లు తప్పుకాదు
జగన్ అక్రమాస్తుల కేసులో బహుళ చార్జిషీట్లు వేయడం చెల్లదన్న వాదనను జస్టిస్ చంద్రకుమార్ తోసిపుచ్చారు. “బహుళ చార్జిషీట్లను చట్టం అంగీకరించదనడం సరికాదు. నిందితులపై ఉన్న అభియోగాలను రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. పలు మార్గాల్లో లావాదేవీలు జరిగాయి. వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు సమయాల్లో చోటు చేసుకున్నాయి. వేర్వేరు శాఖలు జీవోలు జారీ చేశాయి. దేనికది ప్రత్యేకమే అయినప్పటికీ… అరోపణలు మాత్రం ఒకే రకమైనవని, అంతిమ లబ్ధిదారుడు ఒకరేనని గుర్తుంచు కోవాలి” అని జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు.

“అనేక అభియోగాలున్నాయి. వాటన్నింటిలో జగన్, విజయ సాయిరెడ్డి ఉమ్మడిగా ఉన్నారు. అంటే… ఒకే కుట్రను, ఒకే ఉద్దేశంతో ఒకే రకమైన ప్రణాళిక ద్వారా అమలు చేసి ఉండాలి. కానీ… (ప్రభుత్వం నుంచి) లబ్ధిదారులు మాత్రం వేర్వేరు” అని స్పష్టం చేస్తూ బహుళ చార్జిషీట్లు వేయడాన్ని సమర్థించారు. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను కూడా ఉటంకించారు.

సహాయ నిరాకరణ నిజమే!
జగన్‌ను సీబీఐ అధికారులు వేధిస్తున్నారన్న ఆరోపణలను జస్టిస్ చంద్రకుమార్ తోసిపుచ్చారు. సీబీఐకి జగన్ పట్ల ఎలాంటి కక్ష లేదన్నారు. “జగన్ సంస్థల్లో నిధుల వరద, పెట్టుబడుల ప్రవాహంపై సీబీఐ వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి… పూర్తిస్థాయి నిర్ధారణకు వచ్చిన తర్వాతే విచారణకు రావాల్సిందిగా జగన్‌కు నోటీసులు ఇచ్చింది. సీబీఐ సమర్పించిన సీడీలను పరిశీలించిన తర్వాత… మూడు రోజుల విచారణలో జగన్ ఏ మాత్రం సహకరించలేదనే వాదన సరైనదే అనిపించింది” అని తెలిపారు. ‘ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం దాల్చే హక్కు నిందితునికి ఉన్నట్లే… వాస్తవాలను వెలికి తీయడానికి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే హక్కు సీబీఐకి ఉంది’ అని స్పష్టం చేశారు.

మధ్యంతర బెయిల్ కోరలేదు…
కేఏ పాల్‌కు హత్యానేరం కేసులో తాత్కాలిక బెయిల్ ఇవ్వడానికీ, జగన్ కేసుకూ సంబంధం లేదని జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు. “మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా జగన్ కోరలేదు. బెయిల్ కోసం ఎటువంటి ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయలేదు. జగన్ కేసులో నేర తీవ్రత అధికంగా ఉంది. సీబీఐ రిమాండ్ రిపోర్టులూ ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. ఈ అభియోగాలపై నిగ్గు తేల్చాల్సిన అవసరముంది. జగన్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరే హక్కు సీబీఐకి ఉంది” అని తెలిపారు. ఇటువంటి పెద్ద కేసుల్లో నిర్ణీత గడువు లోపల దర్యాప్తు చేయడం సాధ్యం కాదని, సీబీఐకి మరింత గడువు ఇవ్వాల్సి ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దేశ, విదేశాలు, వివిధ కంపెనీల నుంచి వచ్చిన నిధులు, పెట్టుబడుల మూలాలను ఛేదించాల్సిన అవసరం ఉందని అన్నారు.

శభాష్.. నితీశ్!
‘అక్రమార్కుల నివాసాలను స్వాధీనం చేసుకుంటాం. వాటిని పాఠశాల భవనాలుగా మార్చేస్తాం!’ ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన ప్రకటన! ఇది ఉత్తుత్తి హెచ్చరిక కాదు! నిజంగానే ఆయన అక్రమార్కుల ‘పని’ పట్టడం మొదలుపెట్టారు. అక్రమార్క ఐఏఎస్ శివశంకర్ వర్మ పాపిష్టి సొమ్ముతో కట్టుకున్న మూడంతస్తుల విలాసవంతమైన భవంతిని నితీశ్ సర్కారు స్వాధీనం చేసుకుంది. ఆ భవంతిని ప్రభుత్వ పాఠశాల భవనంగా మార్చింది. పాట్నాలో శివశంకర్ నిర్మించుకున్న ఈ ఇంటి విలువ దాదాపు 5 కోట్ల రూపాయలు.

ప్రకటనలు

2 Comments

  1. @చార్జి షీట్ల మీద చార్జి షీట్లంటూ సీబీఐ ని వెక్కిరించని వాళ్ళు లేరు…ఎందుకలా వేసారో అర్ధమయ్యిందా..ఇంకా విననట్టు నటిస్తారా ?గుర్తుంచుకోవాల్సింది, అధికారుల పై మనకు గౌరవం లెదు..అంత మాత్రాన వాళ్ళు అసమర్ధులు అయిపోరు….

    “బహుళ చార్జిషీట్లను చట్టం అంగీకరించదనడం సరికాదు. నిందితులపై ఉన్న అభియోగాలను రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. పలు మార్గాల్లో లావాదేవీలు జరిగాయి. వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు సమయాల్లో చోటు చేసుకున్నాయి. వేర్వేరు శాఖలు జీవోలు జారీ చేశాయి. దేనికది ప్రత్యేకమే అయినప్పటికీ… అరోపణలు మాత్రం ఒకే రకమైనవని, అంతిమ లబ్ధిదారుడు ఒకరేనని గుర్తుంచు కోవాలి” అని జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు.

  2. గొర్రె జనాలను డిస్ట్రాక్ట్ చేయడానికి CBI అధికారి మీద మీడియాలో బురద జల్లడం లాంటి ఇంకెన్ని గిమ్మిక్కులు చేస్తాడో. ఏదేమైనా ‘చిపరికి మిగిలేది’ వూచలు లెక్కట్టడం, అక్రమాస్థుల స్వాధీనం అని ఆశిద్దాం. 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s