రండి,ఇక హైకోర్ట్ ను తిడదాం!!!


అరెస్టు సక్రమమే
జగన్ బయట ఉండాల్సిన వాడు కాదు
ఆర్థిక, అంగ బలాలతో సాక్షులను బెదిరిస్తారు
సీబీఐ వాదనతో ఏకీభవించిన హైకోర్టు
క్వాష్ పిటిషన్ కొట్టివేత.. కస్టడీ పిటిషన్‌కు ఓకే
జగన్ సీబీఐ కస్టడీకి అప్పగింత
హైదరాబాద్, జూన్ 2 : అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ జగన్‌కు మరోసారి చుక్కెదురైంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొమ్ములు తిరిగిన న్యాయవాదులను నియమించుకున్నా ఫలితం దక్కలేదు. తన అరెస్టు అక్రమమంటూ ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. జగన్ అరెస్టు సక్రమమేనని తేల్చి చెప్పింది. జగన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ పిటిషన్‌ను ఆమోదించింది. ఆయన కస్టడీ కోరుతూ సీబీఐ చేసిన వాదనలను పూర్తిస్థాయిలో సమర్థించింది.

జగన్‌ను ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ జరపాలని ఆదేశించింది. ఈ విచారణను జగన్ న్యాయవాదుల సమక్షంలో చేయాలని స్పష్టం చేసింది. సీబీఐ అరెస్టు అక్రమమంటూ జగన్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌తోపాటు సీబీఐ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా దాఖలు చేసుకున్న తొమ్మిది పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ శనివారం డిస్మిస్ చేశారు.

జగన్‌ను సీబీఐ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తూ ప్రత్యేక కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. కింది కోర్టు ఉత్తర్వును సవరిస్తూ జగన్‌ను ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగానే సీఆర్‌పీసీ 41 (సి) కింద నోటీసులు ఇచ్చి జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సమర్థించారు. హత్యా నేరం కేసులో అరెస్టైన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బెయిల్‌కూ ఈ కేసుకూ సంబంధం లేదని జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు.

తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ జగన్ తన పిటిషన్లో కోరలేదని, బెయిల్ కోసం ఆయన ప్రత్యేకంగా ఎటువంటి పిటిషన్ దాఖలు చేయలేదని స్పష్టం చేశారు. క్వాష్, కస్టడీ పిటిషన్లపై సీబీఐ, జగన్ తరఫున రెండు రోజులపాటు సుదీర్ఘంగా హోరాహోరీ వాదనలు విన్న న్యాయమూర్తి శనివారం తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

జగనే కింగ్‌పిన్
“నిందితులకు అంగ బలం, అర్ధ బలం ఉంది. సాక్షులను బెదిరించి, సాక్ష్యాలను తారుమారు చేసే సత్తా వారికి ఉంది. ఇలాంటి వ్యక్తులు బయట ఉండాల్సిన వారు కాదు” అని జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. ఎంపీ అన్న కారణంతో జగన్‌ను వదిలేస్తే సాక్షులపై ఆయన ప్రభావం పడుతుందన్న సీబీఐ వాదనలను సమర్థించారు. ప్రధాన నిందితుడు జగన్‌ను అరెస్ట్ చేసిన తర్వాతే ముగ్గురు సాక్షులు సీబీఐ ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పేందుకు సిద్ధపడ్డారని, ఆయన బయట ఉంటే వారు వెనక్కు తగ్గుతారన్న సీబీఐ వాదనను పూర్తిగా సమర్థించారు.

సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందంటూ సీబీఐ ఇచ్చిన రికార్డులను పరిశీలిస్తే టాంపరింగ్‌కు పాల్పడే అవకాశాలు ఉన్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. జగన్‌ను సీబీఐ అధికారులు వేధిస్తున్నారంటూ ఆయన తరఫు న్యాయవాదులు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. సీబీఐకి వ్యక్తిగతంగా జగన్ పట్ల ఎలాంటి కక్షపూరిత ధోరణి లేదన్నారు. జగన్ సంస్థల్లోకి నిధుల వరద, పెట్టుబడుల ప్రవాహంపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన సీబీఐ పూర్తిస్థాయిలో నిర్థారణకు వచ్చిన తర్వాతే విచారణకు రావాల్సిందిగా జగన్‌కు నోటీసులు ఇచ్చిందని అభిప్రాయపడ్డారు.

“మూడు రోజుల విచారణలో జగన్ ఏ మాత్రం సహకరించ లేదంటూ సీబీఐ కోర్టుకు ఇచ్చిన సీడీలను పరిశీలించిన తర్వాత సీబీఐ వాదనలు సరైనవే అనిపించింది. దర్యాప్తు కీలక దశలో ఉంది. అన్ని కేసుల్లోనూ జగనే కింగ్ పిన్. మరింత సమాచారం రాబట్టడానికి ఆయనను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. అందుకే ఆయనను కస్టడీకి ఇస్తున్నాం” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ఈ కేసులో జగన్‌పై నేర తీవ్రత అధికంగా ఉందని, ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో సీబీఐ ప్రస్తావించిందని, ఈ అభియోగాలపై నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఇంకా 37 అభియోగాలపై దర్యాప్తు చేయాల్సి ఉందని, ఇప్పటి వరకూ దాఖలు చేసిన చార్జిషీట్లు, కేసు డైరీల్లో ఆ అంశాలను ప్రస్తావించలేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారని, అందుకే ఆ అభియోగాలపై మరింత లోతుగా పరిశీలించేందుకు జగన్‌ను కస్టడీకి ఇస్తున్నట్లు న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇటువంటి పెద్ద కేసుల్లో నిర్ణీత గడువు లోపల దర్యాప్తు చేయడం సాధ్యం కాదని, సీబీఐకి మరింత గడువు ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దేశ, విదేశాలు, వివిధ కంపెనీల నుంచి వచ్చిన పెట్టుబడుల మూలాలను ఛేదించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జగన్‌కు కస్టడీకి ఇస్తే సీబీఐ ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందన్న ఆయన తరఫు న్యాయవాదుల వాదనలను న్యాయమూర్తి కొట్టిపారేశారు. ఈ కేసులో రెండో నిందితుడు సాయిరెడ్డి కస్టడీ సందర్భంగా వ్యవహరించినట్లే జగన్‌నూ విచారణ చేయాలని సీబీఐ అధికారులకు స్పష్టం చేశారు.

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s