నేర స్వరూపం తీవ్రంగా కనిపిస్తోంది….


క్విడ్ ప్రో కో జరిగి ఉండొచ్చు
నేరం చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయ్
ఆర్థిక నేరాల్లో సాక్ష్యాధారాలు సేకరించడం కష్టం
జగన్ అరెస్టై ఐదు రోజులే అయింది
ఆయనకు సాయం చేసినవారే
ఎక్కువ రోజులుగా జైల్లో ఉన్నారు
విచారణ ఆలస్యమయ్యే అవకాశం
ఉందని కూడా బెయిల్ ఇవ్వలేం
హత్యానేరం వేరు.. ఆర్థిక నేరం వేరు
నేర స్వరూపం తీవ్రంగా కనిపిస్తోంది
జగన్ బెయిల్ పిటిషన్‌పై తిరస్కరిస్తూ
సీబీఐ కోర్టు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, జూన్ 2: జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితులు నేరం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నాంపల్లి సీబీఐ న్యాయస్థానాల ప్రిన్సిపల్ జడ్జి పుల్లయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాధారాలను త్వరగా సేకరించడం కష్టమని, పరిస్థితుల ఆధారంగా నేర తీవ్రతను గుర్తించాలన్న సీబీఐ వాదనను సమర్థించారు. హెటెరో, అరబిందో సంస్థలకు భూ కేటాయింపులు, అవి తిరిగి జగతి పబ్లికేషన్స్‌కు చెందిన జనని ఇన్‌ఫ్రాలో పెట్టిన పెట్టుబడులను పరిశీలిస్తే క్విడ్ ప్రో కో జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వైఎస్ జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు శుక్రవారం కొట్టేసిన సంగతి తెలిసిందే! దానిని తిరస్కరించడానికి కారణాలను వివరిస్తూ జడ్జి పుల్లయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అక్రమ ఆస్తుల కేసులో జగన్ ఇటీవలే అరెస్టయ్యారు. శుక్రవారం నాటికి కేవలం ఐదు రోజులే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయనకు సాయం చేసిన ఇతర నిందితులు మాత్రం ఆయనకన్నా ఎక్కువ రోజులుగా రిమాండ్‌లో కొనసాగుతున్నారు” అంటూ వారంతా జైల్లో ఉండగా.. జగన్ మాత్రం బెయిల్ కోసం తొందరపడుతున్నారన్న భావనను వ్యక్తం చేశారు. జగన్‌కు రాజకీయ పలుకుబడి ఉందని, ఆయన బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేయొచ్చని, సాక్షులను బెదిరించవచ్చన్న సీబీఐ వాదనతో ఏకీభవిస్తూ ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. కోర్టు ఇంకా ఏమందంటే..!

ఆర్థిక నేరాల్లో సాక్ష్యాధారాల సేకరణ కష్టమే!
ఆర్థిక నేరాల్లో నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేయొచ్చు. అందుకే బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తోంది. కేసు విచారణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని నేపథ్యంలో, విచారణ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న కారణం చూపి కూడా బెయిల్ పొందేందుకు జగన్ అర్హుడు కాలేరు. ప్రధాన నిందితుడి ప్రయోజనాల కోసమే తాము ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న నిందితులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్విడ్ ప్రో కో కిందే ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ఉండవచ్చు. తద్వారా నిందితుడికి లబ్ధి జరిగి ఉండొచ్చు! ఈ వ్యవహారంలో పిటిషన్‌దారుడే (జగన్) ప్రధాన నిందితుడు. మిగిలిన వారు కేవలం ఆయనకు సహకరించినవారే.

ఆ కేసు వేరు ఇది వేరు
పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్‌కు చెందిన సుశాంత్ ఘోష్ అనే ఎమ్మెల్యే ఓ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తల హత్య కేసులో నిందితుడిగా ఉన్నా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని డిఫెన్స్ న్యాయవాది కోర్టుకు చెప్పారు. దానిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. “అది హత్యానేరం. అందులో సాక్ష్యాలు సేకరించడం సాధ్యమవుతుంది. ఆర్థిక నేరాల్లో అలా కాదు. ఆ కేసు వేరు. ఈ కేసు వేరు” అని పేర్కొంది.

క్విడ్ ప్రో కో జరిగి ఉండొచ్చు!
జగతిలోకి నిధుల రాక, ప్రతిగా ఆయా సంస్థలకు భూముల కేటాయింపులపై సీబీఐ అనేక అంశాలను కోర్టు దృష్టికి తెచ్చింది. వాటిపై కోర్టు స్పందిస్తూ..”హెటెరో సంస్థ జనని ఇన్‌ఫ్రాలో రూ.కోట్లు పెట్టుబడులు పెట్టింది. ప్రతిగా ప్రభుత్వం ఆ సంస్థకు విశాఖపట్నం జిల్లా నక్కపల్లి వద్ద భూములు కేటాయించింది. ఈ కేసుకు ఆధారంగా సీబీఐ 30 మంది సాక్షులను, 28 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది.

ఈ క్రమంలో నిందితుడు నేరం చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు కోర్టు భావిస్తోంది. ఈ కేసులో నేర స్వరూపం తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది” అని కోర్టు వ్యాఖ్యానించింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నిందితుడికి బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదని, ఆయన రాజకీయ హోదా, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇవ్వలేమని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s