యంత్రాలు పిల్లల్ని సరీగ్గా కనలేవు…


ఆంధ్ర జ్యొతి డైలీ నవ్య లో ఈ రోజు(11-05-2011) ఓ ఆర్టికల్ …
చదవగానే నాకలానే అనిపించింది….
మనుష్యుల్లా బ్రతకలేకపోతున్నాం…..అన్నీ అవసరమే.. ప్లాస్మా టీవీ లు…ఒక ఫోర్ వీలర్…
రెండు టూ వీలర్లూ…మళ్ళీ రిఫ్రిజరేటర్ కొత్తది మార్చాలీ…బయటకు లాప్ టాప్…బెడ్ రూమ్ లో ఒక టీవీ…
పాత కారు మార్చి కొత్తది తీసుకోవాలీ..
అవసరాలు సృష్టించుకుని…డబ్బుకోసం యంత్రాల్లా పనిచేస్తే…..

ఇదీ ఆర్టికల్…

ఒక గంటలో అంతా క్లీన్ అయిపోయింది

” తల్లి ఎక్కువ ఒత్తిడికి లోనవటం వల్ల గర్భస్థ శిశువు గుండె ఆగిపోయింది”- ఇదీ రిపోర్టు సారాంశం. దాన్ని చూడగానే అగాధంలో కూరుకుపోయినట్లనిపించింది. ‘భూమి మీద పడిన తర్వాతే మన పిల్లకింద లెక్క’- అని అమ్మ చెప్పిన ఓదార్పు మాటలు గుర్తుకొచ్చాయి. కాని నా నిర్లక్ష్యం వల్ల కడుపులో పిల్ల చనిపోయిందనే భావనను అంత త్వరగా ఎలా తుడిచేయగలను? రిపోర్టు పక్కన పెట్టానో లేదో శీను వచ్చాడు. “ఇలాంటివన్నీ మామూలే. కొద్ది కాలం ఇబ్బందిగా ఉంటుంది. కాని తర్వాత రొటీన్‌లో పడిపోతాం. ఇందులో మన తప్పేం లేదు.

ఒక్క వారం ముందు డాక్టర్ దగ్గరకు వెళ్లి ఉంటే బావుండేది. కాని ఇలా అవుతుందని మనమేం కలగనలేదు కదా..”- ఇలా అతని ధోరణి సాగిపోతోంది. రిపోర్టు అతని చేతికి ఇచ్చాను. కొద్దిగా చదివాడో లేదో హఠాత్తుగా స్వరం పెంచి మాట్లాడటం మొదలుపెట్టాడు. “జాగ్రత్తగా ఉండాలని మొదటి వారం నుంచి చెబుతున్నా. ఈ రిపోర్టు చూస్తే మీ అమ్మ, నాన్న ఏమనుకుంటారు? అయినా ఎక్కువ స్ట్రెస్‌లో ఉన్నావనే విషయం నువ్వు చెబితే తప్ప నాకెలా తెలుస్తుంది?” అన్నాడు. అరక్షణం ముందు మన తప్పేం లేదన్న పెద్దమనిషి, ఇప్పుడు తప్పంతా నామీదే వేసేశాడు. రోజూ సాయంత్రమయ్యేసరికి గాలి తీసేసిన బెలూన్‌లా ఇంటికి వస్తున్నప్పుడు- ‘స్ట్రెస్ మామూలే, తట్టుకొని నిలబడాలని’ లెక్చర్‌లు ఇచ్చే వ్యక్తి- ఇప్పుడు నా పరిస్థితి గురించి తనకు తెలియదంటున్నాడు. బహుశా శీనుకు నాకు అబార్షన్ అయిందనే బాధ కన్నా మా అమ్మనాన్న ఏమనుకుంటారోననే బెంగే ఎక్కువ ఉన్నట్లుంది!

ప్రెగ్నసీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నిస్తున్నా. ఎందుకైనా మంచిదని రెండో నెల వచ్చే దాకా ఎవరికీ చెప్పలేదు. అమ్మకు కూడా. కచ్చితం అనుకున్న తర్వాతే అందరికి చెప్పా. అమ్మ హడావిడి చేయటం మొదలుపెట్టింది. నా జాతకం ప్రకారం మూడో నెలలో చేయాల్సిన శాంతుల దగ్గర నుంచి పాప బారసాల దాకా అన్నీ ప్లాన్ చేయటం మొదలుపెట్టింది. “ఓ ఆర్నెల్లు సెలవు పెట్టి వచ్చేసేయి” అంది. నాకు నవ్వొచ్చింది. శీనుకు చెబితే ‘పోనీ ఆలోచించు’ అన్నాడు.

ప్రస్తుతం నేను చేస్తున్న ప్రాజెక్టులో ఆర్నెల్లు కాదు కదా.. ఆరు వారాల సెలవు కూడా దొరకదు. పైగా ఇది అప్రైజల్ టైమ్. అటు, ఇటు అయితే ఈ ఏడాది ప్రమోషన్ పోతుంది. ప్రమోషన్ పోతే సేలరీ హైక్ ఉండదు. జీతం పెరగకపోతే ఇంటి లోన్ రీపేమెంట్ ఆలస్యమయిపోతుంది. అప్పుడప్పుడు ఈ ఉద్యోగం, ఈ జీవితం చూస్తుంటే- పంజాబీ డ్యానర్లు చేసే దీపాల డ్యాన్స్ గుర్తుకొస్తుంది. షో అయ్యే దాకా ఆ దీపాలను నవ్వుతూ మోస్తూ ఉండాలి. నూనె చిందకుండా జాగ్రత్తపడాలి. చూసే వారికి వాళ్లు తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తున్నట్లనిపిస్తుంది. ఆ డ్యాన్సర్ గుండెల్లోని భయం మనకు అనుభవిస్తే కాని తెలియదు.

తొమ్మిదో నెలలో తప్ప సెలవు పెట్టనని చెప్పేసరికి అమ్మ పెద్ద తగువు వేసుకుంది. నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మమ్మ తనను ఎంత జాగ్రత్తగా చూసుకుందో చెప్పింది. నేను రాకపోతే నాన్న ఎంత బాధపడతారో చెప్పింది. తనకెంత టెన్షన్‌గా ఉంటుందో చెప్పింది. చివరకు మొగుళ్ల నుంచి మగవాళ్ల నుంచి దూరంగా ఉండటానికి ప్రెగ్నన్సీ ఎంత మంచి అవకాశమో కూడా చెప్పింది. అంత చెప్పిన తర్వాత కూడా నేను సెలవు పెట్టడానికి సాహసం చేయలేకపోయా. మనసులో సెలవు పెట్టాలని లేక కాదు. పెట్టలేని నిస్సహాయత.

ఆర్థిక స్వాతంత్య్రం ఆడవాళ్ల జీవితాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని చాలా మంది చెబుతూ ఉంటారు. అది ఒక పార్శ్వం మాత్రమే. ఆర్థిక స్వాతంత్య్రం ఆడవాళ్లకు మరిన్ని బాధ్యతలు కూడా నెత్తిమీద పెట్టింది. ఒకప్పుడు ఇంటిని నడపటం మాత్రమే గృహిణి బాధ్యత. ఇప్పుడు ఇంటిని నడపటానికి అవసరమైన వనరులను సమకూర్చుకునే బాధ్యత కూడా ఆమెదే. ఆడపని, మగపని కూడా ఆమెదే. ఆకాశంలో సగభాగం లాంటి నినాదాలు వినటానికి చాలా బావుంటాయి. కాని ఆకాశంలో సగమే కాదు.. బాధ్యతలు మొత్తాన్ని పురుషులు తమకు అప్పగించేస్తున్నారని చాలా మంది గృహిణులకు తెలియదు.

శీనుతో ఈ విషయం గురించి ఎన్ని సార్లు మాట్లాడినా- ‘ఇది నీకు, మీ అమ్మకు సంబంధించిన విషయం’ అనేవాడు. ఒక రోజు – ‘ప్రమోషన్ పోతే పోయింది. మనకు బేబీ ముఖ్యం’ అనేవాడు. మర్నాడు వచ్చి ‘ ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించు. వంట పనికి ఎవరినైనా పెట్టుకుందాం. డ్రైవర్‌ను పెట్టుకుందాం. నీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తా’ అనేవాడు. ‘నువ్వు ఉద్యోగం మానకు. మనకు అది చాలా అవసరం. కష్టమో నష్టమో భరించు. అవసరమైతే నీకు నేను హెల్ప్ చేస్తా’- ఇదీ శీను కవిభావం. అలాగే నాలుగు నెలలు గడిచిపోయాయి.

అమ్మ మధ్య మధ్యలో వచ్చి వారం రోజులు ఉంటోంది. మళ్లీ ఊరెళ్లి వస్తోంది. డాక్టర్ దగ్గరకు వెళ్లా. ‘ బేబీ వీక్‌గా ఉంది. వీలైతే రెస్ట్ తీసుకోండి. తప్పనిసరి అయితేనే వర్క్‌కి వెళ్లండి. డెడ్‌లైన్లు, కాన్ఫరెన్స్‌లని టెన్షన్ పెట్టుకోకండి’ అన్నాడు. ఆ డాక్టర్. ఆ మాటలు విని నేను టెన్షన్ పడుతుంటే ‘ఒత్తిడి అనేది మన ఆలోచనలోనే ఉంటుంది. యోగా చేయి. అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది.

టానిక్‌లు తీసుకుంటే బేబీ బెటర్ అవుతుంది’ అన్నాడు శీను. మరో పదిహేను రోజులు అలాగే గడిచాయి. ఒక రోజు సాయంత్రం ఆఫీసులో ఉండగా విపరీతమైన కడుపు నొప్పి. కూర్చోలేనంత నెప్పి. లోపల ఏదో జరుగుతోందని తెలుస్తోంది. శీనుకు ఫోన్ చేశా. తను ఏదో కాన్ఫరెన్స్‌లో ఉన్నాడనుకుంటా. కాల్ తీసుకోలేదు. ఆఫీసు వాళ్లే అంబులెన్స్ పిలిచారు. ఇద్దరు కొలీగ్స్ తోడొచ్చారు. డాక్టర్ చూసిన వెంటనే ఇది అబార్షన్ కేసన్నాడు. ఒక గంటలో అంతా క్లీన్ అయిపోయింది.

బేబీ లేదు. కాని నాలో ఒక గిల్టీ ఫీలింగ్ మాత్రం ఉంది. ఒక మహిళకు ప్రకృతి వరంగా ఇచ్చే అనుభూతులను ఆస్వాదించే సమయం కూడా లేనందుకు దుఃఖంగా ఉంది. నా పిల్లను రక్షించుకోలేకపోయినందుకు గిల్టీగా ఉంది. ఇదెప్పుడు పోతుందో చెప్పలేను!

ప్రకటనలు

10 Comments

 1. మనుషులం మనుషుల్లా బ్రతకటం సాధ్యపడటం లేదు.
  మనుషులం యంత్రాల్లా బ్రతకటం సాధ్యపడేది కాదు.
  యంత్రాల్లా కష్టపడతాం
  మనుషుల్లా బాధపడతాం
  ఈ కష్టం తరిగేది కాదు
  ఈ బాధ తీరేది కాదు
  తనను కట్టుతాడు తా తెచ్చుకున్నట్లు
  మనను మనమే బంధించుకుంటున్నాం
  మితిమీరిన మన నాగరీకం
  మతిలేని పరుగులలోకం

 2. ఒక సీనియర్ డాక్టర్ గా చెప్తున్నాను.ముందుగా మీకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.గర్భం దాల్చాక 5వనెలనుంచి ,ప్రసవం ఐనాక 3నెలలు దాకా విశ్రాంతి అవసరం.తేలిక ఐన పనులు( ఆరోగ్యం బాగుంటే) చేసుకోవచ్చును.అందులో ఈ రోజుల్లో ఒకరు,ఇద్దరు ,పిల్లలకన్నా ఎక్కువ సంతానం కనడం లేదు కాబట్టి.ప్రభుత్వ ఉద్యోగమైనా ,ప్రైవేటు ఉద్యోగమైనా ఈ8 నెలలు సెలవు నిర్బంధంగా ఇవ్వాలనే చట్టం రావాలి.భార్యాభర్తలు దూరంగా ఉంటే మంచిది.అందుకే పూర్వం మొదటి కానుపు కైనా,పుట్టింటికి 5వనెలలో తీసుకువచ్చి ,డెలివరీ తర్వాత 3నెలలో అత్తవారింటికి పంపించేవారు.లేడీ డాక్టర్ కి ప్రతి నెలా చూపించు కోవాలని వేరే చెప్పనక్కరలేదు.ఇప్పుడయినా GynecologisT ని సంప్రదించేవుంటారను కొంటాను.

 3. డాక్టరు గారూ మీ స్పందనకు ధన్యవాదాలు…ఇక్కడ ప్రచురింపబడ్డ ఆర్టికల్ ను నేను ఈ రోజు ఆంద్రజ్యోతి డైలీ నవ్య పేజీ నుండి తీసుకుని బ్లాగ్ లో ఉంచడమైనది…సంబందీకులు చూసి ఉన్నట్టైతే మీ సూచన పాటించ గలరని ఆశిద్దాం…మీకు మరో మారు ధన్య వాదాలు తెలుపుకుంటున్నాను… Dr.kvsv prasad.

 4. @తాడిగడప శ్యామలరావు
  యంత్రాల్లా కష్టపడతాం
  మనుషుల్లా బాధపడతాం..

  థాంక్సండీ…ఇంత కాలం అనుమానముండేది
  యంత్రాలమై పోయాము కదా.
  అయినా కూడా ఈ పరిస్థితిని ఎందుకు డైజెస్ట్ చేసుకోలేక పోతున్నాం అని…
  రెండు ముక్కల్లో తేల్చి చెప్పారు..నిజమే..

 5. *ఆకాశంలో సగభాగం లాంటి నినాదాలు వినటానికి చాలా బావుంటాయి. *
  సార్,

  ఆకాశంలో సగభాగం లాంటి పుస్తకాలు రాసింది మహిళా రచయితలు. ఎలాగైతె, కమర్షియల్ సినేమాలో ఏ హీరో అయినా కథలో మార్పు ఉండదో,అదే విధంగా స్రీ వాద సాహిత్యంలో ఏ పుస్తకం చదివినా దానిలో ఉండే సారాంశం, మహిళలు పురుషుడి చేతిలో మోసపోతున్నారు. వారు తమ కాళ్ల పైన నిలబడటానికి ఆర్ధిక స్వాతంత్రం కొరకు ఉద్యోగం చేయాలి. ఆ నవలలో చాలా కథలు ఇంటి నుంచి బయటపడి, ఉద్యోగం సంపాదించుకొని, తనకు నచ్చిన హాబిని కొనసాగిస్తూ, సంసారాలు చేస్తున్న తన మిత్రురాళ్ల జీవితాలను చూసి జాలి పడుతూ, అటువంటి స్థితి నుంచి తాను బయటపడి, స్వేచ్చగా జీవిస్తున్నట్లు, అదే జీవిత పరమార్ధం అనే విధంగా రాసి ముగింపును ఇస్తారు. వాటిని అంతటితో ముగిస్తే తృప్తి రాదు కనుక, ఆకాశంలో సగభాగం అంటే అది చదివిన పాఠకులకు తామేదో ఇంతక్రితం కోల్పోయిన దానిని తిరిగి పొంది విజయం సాధించామన్న భావన కలుగుతుంది.

 6. ప్రవీణ్ శర్మ,
  ఆయనకు ముందు కూడా “ఆకాశంలో సగ భాగం మహిళలదే” అని ఇంకొకరు ఆమాట చెప్పి ఉండవచ్చేమో! నేను తెలుగులో చదివిన పుస్తకం గురించి ప్రస్థావించాను అంతే!

 7. అయితే యూరోపియన్ దేశాలో ఏవో ఉన్నాయి కదా??అక్కడ ఆడొళ్ళూ మగాళ్ళూ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు అనుకుంటా …
  అక్కడ స్త్రీలంతా స్వేచ్చగా ఉండి జీవిత పరమార్దాన్ని ఎన్జాయ్ చేస్తున్నారా??
  అలా అయితే కధల్లో చెప్పింది నిజమైనట్లే కదా??
  ఒకటి మాత్రం నిజం మగవాడు ఉండగా స్త్రీ కి స్వేచ్చ ఉండదు కాక ఉండదు…
  తన ఆలోచనల్లోంచి పుట్టిన వికారాలతో చిత్రవధ చేస్తాడు మగవాడు.. స్త్రీ ని…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s