వైద్యానికి డబ్బు జబ్బు -3


రాష్ట్రంలోని ఆసుపత్రుల తీరు తెన్నులు బట్టబయలు చేశారు ఆంద్రజ్యోతి వారు…ఇక ముందెప్పుడూ ఇలా అయ్యిందేమిటే ఆసుపత్రికి వెళ్తే అని ప్రతీ సారీ జుత్తు పీక్కోకుండా ….మొత్తం విషయాన్ని స్పష్టం చేశారు…పనిలో పనిగా మెడికల్ ప్రొఫషన్ అనడం మానేసి మెడికల్ ఇండస్ట్రీ అనడం బావుంటుందేమో…………..

వైద్యానికి డబ్బు జబ్బు -3

ఏజెంట్ డాక్టర్
రోగుల కోసం ఆసుపత్రులు, డాక్టర్ల కమీషన్ దందా
గ్రామాల నుంచి రోగుల సరఫరా
చిన్న డాక్టర్లే ఏజెంట్లు
ఆస్పత్రులకు మార్కెటింగ్ విభాగాలు
టౌన్ నుంచి పల్లెల దాకా నెట్‌వర్క్
ఒక్కోకేసుకు 30 శాతం వాటా
హైదరాబాద్, ఏప్రిల్ 17 : ‘అబ్బో… ఇది చానా పెద్ద రోగం! పట్నం పోవాల్సిందే!’… అంటాడు పల్లెటూరులోని ఆర్ఎంపీ! ఆ మాట వినగానే రోగి, బంధువులు బెంబేలెత్తిపోతారు. ‘ఎక్కడికి పోవాల్నో మాకు తెలియదు. మీరే చెప్పండి’ అంటూ ఆర్ఎంపీ శరణుజొచ్చుతారు. పక్కనే టౌనులో, ఇంకొంత దూరంలోని జిల్లా కేంద్రంలో ఆ వ్యాధికి చికిత్స చేయగలిగే డాక్టర్లున్నా… సదరు ఆర్ఎంపీ పెద్దపట్నంలోని కార్పొరేట్ ఆస్పత్రికే రోగుల్ని పంపిస్తాడు. ఇదంతా ఒప్పందంలో భాగం! రోగిని దోచుకోవడానికి పల్లెల్లోని ఆర్ఎంపీకీ, నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రికీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం! దీని ఫలితంగా… చికిత్స ఖర్చు మరో 30 శాతం వరకు పెరుగుతుంది. అది కమీషన్ రూపంలో కార్పొరేట్ ఆస్పత్రి నుంచి ఆర్ఎంపీకి అందుతుంది! రోగిష్టి వ్యాపారంలో లాభాల కోసం ఆస్పత్రులు అమలుచేస్తున్న నెట్‌వర్క్ విష వలయమిది.

ప్లాట్లు, ఫ్లాట్లు, ఫ్యాన్లు, ఏసీల మార్కెటింగ్‌లాగే… వైద్యంలోనూ మార్కెటింగ్ నడుస్తోంది. ప్రతి కార్పొరేట్ ఆస్పత్రికి పట్టణం నుంచి పల్లెదాకా ‘ఏజెంట్లు’ ఉంటారు. ఈ ఏజెంట్లు ఆర్ఎంపీలు కావొచ్చు. ఎంబీబీఎస్ డాక్టర్లూ కావొచ్చు. వీరిని కార్పొరేట్ ఆస్పత్రులు మచ్చిక చేసుకుంటాయి. రోగులను తమ ఆస్పత్రులకే పంపించేలా ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇలా పంపించిన ప్రతి కేసుకూ 30 శాతం వరకు కమీషన్ చెల్లిస్తాయి. ఈ మొత్తాన్ని కూడా రోగి బిల్లులోనే కలిపేస్తారు. దీనికోసం కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా మార్కెటింగ్ విభాగం అధికారులు ఉంటారు.

గ్రామీణ, పట్టణాల్లోని వైద్యులతో సంబంధాలు పెట్టుకోవడం, వారి అవసరాలను తీర్చి రోగులను ఆస్పత్రులకు రప్పించుకోవడం, కమీషన్ ఎప్పటికప్పుడు చెల్లించడం వంటివి వీరే చక్కబెడుతుంటారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రతి జిల్లాలో 15 నుంచి 30 మంది ఆర్ఎంపీ, ఎంబీబీఎస్ వైద్యులు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక… ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, వారికి ఆరోజు బత్తాగా ఓ ఐదారు వేలు ఇవ్వడం, గిఫ్ట్‌లు అందించడం, కుటుంబ సభ్యులతో సహా టూర్లు తిప్పడం వంటివీ ‘మార్కెటింగ్’లో భాగమే! గ్రామాలు, టౌన్ల నుంచి వచ్చే ‘రెఫరెన్స్ కేసు’ల్లో ఆర్ఎంపీ, ఎంబీబీఎస్ వైద్యులకు 30 శాతం కమీషన్ ముడుతుంది. డాక్టర్ ఫీజుపై 10-15 శాతం, శస్త్ర చికిత్సలపై 20 శాతం, వ్యాధి నిర్ధారణ పరీక్షలపై 20 శాతం కమీషన్ ఉంటుంది.

ఒక్క మేజర్ ఆపరేషన్ కేసు రెఫర్ చేస్తే కనీసం 20 వేల నుంచి నలభై వేలైనా ముడతాయని సమాచారం. ఆర్ఎంపీ, ఎంబీబీఎస్ వైద్యులు కేవలం ఒక్క కార్పొరేట్ ఆస్పత్రిపైనే ఆధారపడరు. ఏ ఆస్పత్రి ఎక్కువ కమీషన్ ఇస్తే, ఆ ఆస్పత్రికే రోగులను ‘రెఫర్’ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇందుకోసం నగరంలోని ఓ నాలుగైదు ఆస్పత్రులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లోని గడ్డి అన్నారంలోని ఓ ఆస్పత్రి వద్ద ‘ఆన్‌లైన్’ బృందానికి… ఓ ఆర్ఎంపీ వైద్యుడు రోగిని స్వయంగా తీసుకొచ్చిన దృశ్యం కనిపించింది. తాను నెలకు పది మంది వరకు కేసులను రెఫర్ చేస్తానని ఆయన అంగీకరించారు.

వెయ్యికి 200 ఇవ్వాల్సిందే..
ఈ ఆస్పత్రుల బాగోతం మాకు తెలియదా! వెయ్యి రూపాయల ఇంజెక్షన్‌కు రెండు వేలు వసూలు చేస్తారు. లక్షల రూపాయల బిల్లు వేస్తారు. అయినా మేం పంపిస్తేనేకదా రోగులు ఈ ఆస్పత్రులకు వచ్చేది. మాకు వెయ్యికి రెండొందల కమీషన్ ఇవ్వాల్సిందే. నేను నగరంలోని నాలుగు ఆస్పత్రులకు రోగులను రెఫర్ చేస్తున్నాను. ప్రతి నెలా ఐదారుగురు రోగుల వరకు తప్పని సరిగ్గా పంపిస్తున్నాను. మాకు కమీషన్ ఎవరు బాగా ఇచ్చి, రోగికి మంచి వైద్యం అందిస్తే వారి వద్దకే రోగులను పంపిస్తున్నాను.
– ఆర్ఎంపీ, నల్లగొండ జిల్లా (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు)

ఊళ్లో డాక్టర్ చెప్తేనే వచ్చా…
మా కొడుక్కి పక్షవాతం వచ్చింది. మా ఉళ్లో ఉండే డాక్టర్‌కు చూపిస్తే ఇక్కడ బాగు కాదు, పట్నంలోని పెద్దాస్పత్రికి తీసుకుపొమ్మన్నాడు. ఆయన చెప్పడంతో ఈ ఆస్పత్రికి వచ్చాను. ఇప్పటికే నలబై వేల రూపాయల వరకు ఇచ్చా. ఆస్పత్రిలో ఇంకా నాలుగైదు రోజులు ఉండాలంటున్నారు. ఇంకా ఎంత అవుతుందో ఏమో! ఈ బిల్లు కట్టలేకపోతున్నాను.
– రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం నుంచి వచ్చిన రోగి

ఏజెంట్లు లేకుంటే నడపడం కషటం
‘రెఫరెన్స్’ కేసులు రాకుంటే కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నడపడం కష్టం. గ్రామాల నుంచి రోగులు రావాలంటే స్థానిక డాక్టర్లే దిక్కు. ఆర్ఎంపీ, ఎంబీబీఎస్ వైద్యులతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఉంటాయి. జిల్లాకు ముగ్గురు నలుగురు ఆస్పత్రి సిబ్బంది ఉండి వ్యవహారాలను చక్కబెడుతుంటారు. ఆ గ్రామ వైద్యుల అవసరాలను తీర్చడం, కమీషన్ చెల్లించడం వీరే చేస్తారు.
– హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి పీఆర్వో

కోట్లలో కమీషన్లు
“ఎంసీఐ నిబంధనల ప్రకారం వైద్యులు కమీషన్లు తీసుకోవడం నేరం. ఇది చట్ట విరుద్ధం. వైద్యరంగంలో కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో చేతులు మారుతున్నాయి. దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. నిజానికి… 60 శాతం జబ్బులకు నిర్ధారణ పరీక్షలు అవసరం లేదు. కేవలం ప్యాకేజీ కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. డాక్టర్‌గా, ప్రజాప్రతినిధిగా వైద్య రంగంలో జరుగుతున్న ఈ వ్యవహారాలను కట్టడి చేసేందుకు నా వంతు కృషి చేస్తాను.”
– డాక్టర్ గేయానంద్ (ఎమ్మెల్సీ)

రిబ్బన్ కటింగ్ రోజే
గుంటూరు జిల్లాలో కొద్దికాలం కిందట ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఏర్పాటైంది. దీనిని ప్రముఖ రాజకీయ నేత ప్రారంభించారు. అనతి కాలంలోనే ఈ ఆస్పత్రికి ‘మాంచి’ పేరొచ్చింది. నిత్యం రోగులతో కిటకిటలాడుతూ ఇతర వైద్యులకు కన్నుకుట్టే స్థాయికి ఎదిగింది. ‘ఇందులో తిరకాసు ఏమిటబ్బా!?’ అని కొందరు ఆరా తీశారు. అంతే… దిమ్మదిరిగే నిజాలు తెలిశాయి. సదరు ఆస్పత్రి ప్రారంభోత్సవం రోజే పెద్ద సంఖ్యలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులను పిలిచింది. తమ ఆస్పత్రికి రోగులను తెచ్చే ప్రాతిపదికన అడ్వాన్స్‌గా కమీషన్ చెల్లించింది. అంతే… ఆర్ఎంపీలంతా అదే ఆస్పత్రికి రోగులను పంపసాగారు.

చాంబర్‌కు రెండు ద్వారాలు
గుంటూరు జిల్లాలో కొత్తగా నిర్మించే ్రపైవేటు ఆస్పత్రుల్లో వైద్యుడి కన్సల్టింగ్ చాంబర్‌కు రెండు ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి సాధారణ రోగుల కోసమైతే… మరొకటి వీఐపీలుగా భావించే ఆర్ఎంపీ వైద్యులు తెచ్చే రోగుల కోసం. ఆర్ఎంపీలు తమ ద్వారం నుంచి రోగులను క్షణం కూడా వెయిట్ చేయించకుండా నేరుగా డాక్టర్ వద్దకు తీసుకెళ్లవచ్చు. దీంతో ఆర్ఎంపీల పరపతిపై రోగులకు నమ్మకం(?) పెరుగుతోంది. రోగి ఆస్పత్రిలో చేర్చిన వెంటనే ఆర్ఎంపీలు రిసెప్షన్‌లో తమ కమీషన్ సొమ్ము తీసుకొని వెళతారు.

ఆయనకో స్విఫ్ట్ కానుక
తిరుపతిలోని రెండు కార్పొరేట్ ఆస్పత్రులకు ‘రెఫరెన్స్’ కేసులే ప్రధాన ఆదాయ వనరు. ఓ ఆస్పత్రి యాజమాన్యం చిత్తూరులోని తమ ‘ఏజెంట్ డాక్టర్’ పంపుతున్న కేసులతో పరమానందభరితమైంది. ఆ డాక్టర్‌కు నాలుగు నెలల క్రితం కృతజ్ఞతా పూర్వకంగా సిఫ్ట్‌కారు కానుకగా ఇచ్చింది. కార్పొరేట్ ఆస్పత్రులు తమ వద్దకు కేసులు రెఫర్ చేసే డాక్టర్లకు 15 రోజులకోసారి వారి ఖాతాల్లోనే కమీషన్ మొత్తాన్ని జమ చేస్తాయి.

*డాక్టర్లే కాదు… కొన్ని అంబులెన్స్‌ల డ్రైవర్లూ కార్పొరేట్ ఏజెంట్లే. 108, వైద్య విధాన పరిషత్ అంబులెన్స్‌లు ప్రభుత్వాసుపత్రికే రోగులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా… తమ ఆస్పత్రికి తీసుకొస్తే డబ్బులు ముట్టచెబుతామని ‘మంచి’ చేసుకుంటారు.

* కొందరు ప్రభుత్వ వైద్యులు సైతం కార్పొరేట్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో తగిన వసతులు లేవంటూ ప్రైవేటు హాస్పిటళ్లకు పంపిస్తున్నారు. ఇలా కేవలం ‘రెఫరెన్స్’ల ద్వారానే ప్రతినెలా రూ.10 వేల నుంచి లక్ష వరకు సంపాదించుకునే ఆర్ఎంపీలు, చిన్న డాక్టర్లు చాలామందే ఉన్నారు.

ప్రకటనలు

12 Comments

 1. లక్షలు పెట్టి చదువుకొని కొట్లు పెట్టి ఆసుపత్రులు కట్టి దానిమీద వడ్డీలు లెక్క కట్టుకొని ఇక వాడికి నిద్రపడుతుందా? పెట్టుబడి పెట్టిన తర్వాత దానిపైన లాభం రావాలి.ఆలాభాలు రావాలంటె ఎంతవీలైతె అన్ని అడ్డదారులు తొక్కాలి. ఇప్పుడు ఈరంగం ఆ రంగం అనే తెడా లేదు అన్నిరంగాలలొనూ మార్కెటింగ్ ఏగెంట్లు వున్నరు. పెట్టుబడి ఎంతవీలైతె అంత రాబట్టలనుకొంటుంది దానిస్వాబావమే అంత. దానికి నీతి,జాతి ఏమీవుండవు . అది చెయ్యని నీచమంటూ వుండదు. ఇక డాక్టర్ల గురించి చెప్పాలంటె నూటికి 90 మంది నీచులు వుండారు

 2. మీకో విషయం తెలుసా? వైజాగ్‌లో హాస్పిటల్‌లు రూమ్‌కి తీసుకునే రోజువారీ అద్దె ఐదు వందల రూపాయలు అయితే శ్రీకాకుళంలో ఆ అద్దె వెయ్యి రూపాయలు. అయితే ఆపరేషన్‌లకి అయ్యే ఖర్చు వైజాగ్‌లోనే ఎక్కువ. శ్రీకాకుళం పట్టణ శివార్లలో ఒక మెడికల్ కాలేజ్‌లో ఒక అమ్మాయి ముప్పై లక్షలు పెట్టి సీట్ కొనింది. అంత ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్‌లలో చదివినవాళ్ళు డాక్టర్లైన తరువాత ఖర్చుని రికవర్ చేసుకోవడానికి పేషేంట్‌ల రక్తమే జలగల్లాగ తాగుతారు.

 3. @Praveen Sarma…మీరే కరెక్ట్…అంతేసి డబ్బు పోసి కొన్న వాళ్ళు సమాజసేవ చేస్తారని ఎలా ఆశిస్తాం?
  ఇక పీజీ సీట్లయితే కొట్ల రూపాయలు పలుకుతున్నాయ్…రేడియాలిజీ ఎమ్.డీ..సీటు కోటీ ఇరవై లక్షల రూపాయలంటే మీరు నమ్మ గలరా??ఎమ్.డీ. జనరల్ మెడిసన్ సీటు కోటి రూపాయలు….ఇలా విచ్చల విడిగా సీట్లు అమ్ముకొనే సిస్టమ్ ను ప్రభుత్వం ఎలా ఆమోద ముద్ర వేసిందో?ఇంతా చేసి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారని నిలదీయడానికి ప్రభుత్వానికి నైతిక హక్కు లేనట్లే కదా??

 4. హ్మ్. ఇప్పటిదాకా మందులు అంటగట్టడానికి డాక్టర్లకి అవోఇవో ముట్టుతుంటాయనుకున్నాను. రోగులని అంటగట్టడానికి కూడానా. పోనీలెండి, ఏం చేస్తాం, మన వ్యవస్తే అలా వుంది. తలా పాపం తిలా పిడికెడు. అవినీతి చెయ్యని వాడిని అసమర్ధుడిలా చూస్తున్నారు.

 5. ఒక్క ముక్కలో చెప్పాలంటే వైద్య వృత్తి బ్రష్త్టు పట్టిపోయింది….వైద్య వృత్తితొ పాటు డబ్బు కూడా అదే వస్తుంది కానీ పరిస్తితి ఎలా మారిందంటే డబ్బు చేసుకోవడం కోసమే …వైద్యాన్ని దారుణంగా మార్చేసారు….పాతిక సంవత్సరాలు కూడా నిండని పల్లెటూరి జనానికి లామినెక్టమీ లు వేల సంఖ్యలో చేసి పడేసారు…కేవలం నడుం నొప్పి కోసం వైద్యానికి వెళ్ళిన పేషంట్లకు…
  కారణం ఆరోగ్య శ్రీ లో ప్రభుత్వం డబ్బు మంజూరు చేస్తుంది కాబట్టి….ఇలాంటి ఆపరేషన్ల ద్వారా వేల కోట్లు రూపాయలు ప్రభుత్వం దగ్గర దండేసుకున్నారు……..ఆపరేషను అయ్యాక పట్టించుకునే నాధుడు లేక ఇప్పుడు దీర్ఘ రోగాలతో జనాలు చస్తున్నారు………..

 6. ఆ మెడికల్ కాలేజ్‌కి పెట్టుబడి పెట్టినది పట్టణానికి చెందిన పది మంది డాక్టర్‌లు. ఆ పది మంది డాక్టర్‌లూ లాభాలు పంచుకోవడానికి ఒక్కో విద్యార్థి దగ్గరా ముప్పై లక్షలు ఫీజ్ తీసుకుంటే సరిపోతుంది.

 7. ఏ వృత్తిలో నైనా స్థిరపడే కొద్దీ రాణించే కొద్దీ పేరూ డబ్బూ వాటంతట అవ్వే వస్తాయి….కానీ రాత్రికి రాత్రి డబ్బు గడించేయాలన్న ఆలోచన అన్ని తరగతుల్లో ఒక రుగ్మతలా అల్లుకు పోవడం…..డాక్టర్లు కూడా దానికి మినహాయింపుకాకపోవడం….ఆరోగ్య రంగాన్ని ఈ రకంగా తయారు చెసి ఉండొచ్చు…..ఎతిక్స్…అన్న పదాన్ని డాక్టర్లు మర్చిపోయారు…..వాళ్ళే కాదు అన్ని రంగాల్లోనూ మర్చిపోయారు..లేకపోతే ఎమ్.ఎల్.ఏ.లూ…మంత్రులూ బ్రాందీ షాపులు నడపడమేమిటీ….ఆగండీ …అవి వాళ్ళ పేర్ల మీద లెవు కదా..అనవచ్చు…..ఇలాంటి సినేమా కతలు సానా విన్నాం…

 8. మనిషికి అన్నిటికంటే ప్రాణం ముఖ్యం కదా. అందుకే ప్రాణాలు కాపాడే వృత్తికి మార్కెట్‌లో అంత డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ని ఉపయోగించుకుని డాక్టర్‌లు పేషెంట్‌ల నుంచి లాగగలిగినంత లాగుతున్నారు.

  • పక్క డాక్టరుకు స్కానింగ్ పంపి వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్ లను తీసుకునే స్థాయి ఈ కాలం డాక్టర్లది…ఏ మాత్రం నోబెల్ ప్రొఫషన్ కు అర్హత వీళ్ళకు లేదు….పక్క డాక్టరు అడిగిన దాని కంటె నాకు ఓ వెయ్యి తక్కువ ఇచ్చెయ్యి మా ఆసుపత్రిలో ఆపరేషను చేసేస్తా..అని ఇంకో ఆసుపత్రి డాక్టరు అనే రేంజ్ లో ఉన్నారంటే…వీళ్ళను జనాలు ఊరికే తన్నడం లేదు…

 9. టౌన్ ఎంత పెద్దదైతే అక్కడ అంత మంచి డాక్టర్‌లు ఉంటారనే మూఢ నమ్మకం ప్రజలలో ఉంది. ప్రజలలో ఉన్న ఈ మూఢ నమ్మకమే డాక్టర్‌లకి పైసా ఖర్చు లేని పెట్టుబడి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s