అయ్యా..మీకు పాదాభివందనం…


నిలువెల్లా దుఃఖమై..!
నిండు సభలో ఆంటోనీ కంటతడి
కమ్ముకున్న అవినీతిలో మంచికి పట్టిన దుర్గతి
నిర్వేదం నిండిన ఆ ముఖంలో…
కమ్ముకున్న కన్నీటి పొరను చూశారా?
బతుకంతా విశ్రమించని నిజాయితీ…
అసహాయ అశ్రుబిందువైన వైనాన్ని చూశారా?
కట్టుతప్పిన అవినీతిని కడగలేక
కనురెప్పమాటున దాగిన నీటిబొట్టును చూశారా?
నికార్సైన నీతికి నిలువెల్లా, బతుకల్లా నిబద్ధుడై ఉండికూడా
‘అవినీతి సమాజం’ నుంచి రక్షణ పొందలేక నిస్సహాయంగా,
నిరామయంగా, నిర్లిప్తంగా ఉండిపోవాల్సి వచ్చిన
మన రక్షణ మంత్రిని చూశారా?
దేశాన్ని కాపాడాల్సిన సైన్యమే అవినీతి ఊబిలో కూరుకుపోగా…
ప్రక్షాళన చేయాల్సిన పార్లమెంటు పరనింద క్రీడలో
మునిగిపోగా… నీతికీ, అవినీతికీ మధ్య గీత చెరిగిపోగా…
కన్నీరే ఆలంబనగా నిజపరీక్షకు సత్యపీఠంపై నిలిచిన
ఆంటోనీని చూశారా?

న్యూఢిల్లీ , మార్చి 27 : నిండు సభలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కంట కన్నీరొలికింది. ఇద్దరు అధికారుల మధ్య జరిగిన ముడుపుల మాటలు… ఆంటోనీ నిజాయితీకి పరీక్ష పెట్టాయి. ‘నాసిరకం ట్రక్కులు కొంటే రూ.14 కోట్లు లంచం ఇస్తామని ఓ అధికారి ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని అప్పుడే ఆంటోనీ దృష్టికి తీసుకెళ్లాను’ అని ఆర్మీ చీఫ్ వీకే సింగ్ ఇప్పుడు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ‘దీనిపై అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?’ అంటూ విపక్ష సభ్యులు మంగళవారం రాజ్యసభలో ఆంటోనీని నిలదీశారు. కీలకమైన రక్షణ వ్యవహారాల్లో ఇంత నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు.

నిజానికి… ‘నా తప్పేమీ లేదు’ అని ఆంటోనీ దబాయించవచ్చు. ‘ముడుపులు మీకే చెల్లు’ అని ఎదురు దాడికి దిగవచ్చు. ‘ఆధారాలు చూపండి’ అని నిలదీయనూవచ్చు. వేరెవరైనా అయితే.. కచ్చితంగా ఇలాగే చేసేవారు. కానీ… ఆంటోనీ అలా చేయలేదు. వినమ్రంగా వివరణ ఇచ్చుకున్నారు. ఉద్వేగంతో కంటతడి పెట్టారు. ‘నిజం తప్ప మరేదీ చెప్పను. నేను తప్పు చేయలేదు. తప్పు చేశాననుకుంటే శిక్షించండి’ అని గద్గద స్వరంతో బదులిచ్చారు. కోట్లకు కోట్లు మింగిన వారు, హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, కుంభకోణాల సూత్రధారులు ఎందరో చట్ట సభల్లో ఉన్న కాలమిది!

కానీ… తనపై చిన్న ఆరోపణ రాగానే ఆంటోనీ కదిలిపోయారు. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినందుకు కన్నీరు పెట్టారు. నిజానికి… తలదించుకోవల్సింది ఆయన కాదు! అక్రమార్కులకు, సక్రమాలకూ మధ్య చెరిగిన గీతలతో అందరినీ ఒకే గాటన గట్టే వారు తలదించుకోవాలి. ‘ఏం… వారు అవినీతికి పాల్పడలేదా! కాకపోతే… ఆయనకంటే ఈయన కొంచెం ఎక్కువ తిన్నాడు’ అంటూ అవినీతిలోనూ చిన్నగీత, పెద్దగీతలను గీసేవారు తలదించుకోవాలి. ఆంటోనీ నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపం! కానీ… ఏం చేద్దాం! వరుస కుంభకోణాలు చోటు చేసుకుంటున్న సర్కారులో ఆయన ఒక మంత్రి! అందుకే, ఆయనవైపూ వేళ్లు లేచాయి.

ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో… మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేసినా ఆంటోనీపై చిన్న ఆరోపణ కూడా రాలేదు. ఇప్పుడు కూడా ఆయనపై ప్రత్యక్షంగా ఆరోపణలు ఏవీ లేవు. వేరెవరైనా రక్షణ మంత్రిగా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆ స్థానంలో ఉన్నది ఆంటోనీ కాబట్టి… విపక్షాలూ సంయమనం ప్రదర్శించాయి. ‘రక్షణ శాఖను ప్రక్షాళన చేయండి. మీకు అండగా ఉంటాం’ అని బీజేపీ నేత అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు. ‘మీ నిజాయితీని మేం శంకించడం లేదు’ అని విపక్ష సభ్యులే కితాబిచ్చారు. నిజానికి రక్షణ మంత్రిగా ఆంటోనీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొత్తం వ్యవస్థలో మార్పు వచ్చిందని, రక్షణ ఒప్పందాల్లో అవినీతి తగ్గిపోయిందని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి.

నిరుపేద మంత్రి…
ప్రజా జీవితంలో అవినీతికి తావులేదని బలంగా నమ్మే, అంతే నిక్కచ్చిగా ఆచరించే అతికొద్ది మంది నేతల్లో ఆంటోనీ ఒకరు. ఆయన… ఈ దేశంలోనే అత్యంత నిరుపేద మంత్రి అని చెబితే ఏమాత్రం అతిశయోక్తి కాదు. కేరళకు చెందిన ఆంటోనీకి త్రివేండ్రంలో నాలుగు గదుల ఇల్లు తప్ప మరే ఆస్తీ లేదు. ఆంటోనీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేస్తున్నప్పటికీ… ఆయన సతీమణి ఎలిజబెత్ మాత్రం కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. ఆంటోనీ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 26 ఏళ్ల వయస్సులో కేరళ విద్యార్థి సంఘం నాయకుడయ్యారు. మరో ఆరేళ్లలో ఆయన కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నడిపేందుకు ఏ వ్యాపార సంస్థల నుంచీ నిధులు వసూలు చేయలేదు.

కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన… పార్టీ చెప్పిందే వేదమని… పార్టీ నిర్ణయం ఏదైనా అదే కరెక్ట్ అని ఆయన ఎప్పుడూ భావించలేదు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఎమర్జెన్సీ ఎత్తివేసి మళ్లీ ఎన్నికలు జరపండి’ అని ఇందిరా గాంధీకి సూటిగా సలహా ఇచ్చారు. ఇందిర తీరు మారకపోవడంతో… కాంగ్రెస్‌ను వీడి దేవరాజ్ అర్స్ స్థాపించిన కాంగ్రెస్‌లో చేరారు. అయితే… చికమగళూర్‌లో ఇందిరాగాంధీకి ఆ పార్టీ మద్దతునిచ్చినందుకు నిరసనగా రాజీనామా చేసి… కాంగ్రెస్ (ఎ) పేరుతో సొంత పార్టీ పెట్టారు. ఎల్‌డీఎఫ్‌తో కలిసి… 37 ఏళ్ల వయసులోనే కేరళ ముఖ్యమంత్రి అయ్యారు. 1982లో ఇందిరాగాంధీ కోరిక మేరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

పదవి తృణప్రాయమే…
పదవి కోసం నానారకాల అడ్డదారులు తొక్కే రోజులివి! కానీ… ఆంటోనీ ఎప్పుడూ పదవి కోసం కక్కుర్తి పడలేదు. వచ్చిన పదవిని కాపాడుకునేందుకు పాకులాడలేదు. పీవీ హయాంలో ఆంటోనీ పౌర సరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు… సకాలంలో చక్కెరను దిగుమతి చేయలేదన్న ఆరోపణలు రావడంతో వెంటనే పదవికి రాజీనామా చేశారు. 2004లో లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ అతి తక్కువ సీట్లు సాధించింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇలా రాజీనామా చేసిన ప్రతిసారీ ఆయనకు అంతకంటే గొప్ప పదవే లభించడం యాదృచ్ఛికమైనా విశేషమే! ఏది ఏమైనా… ఒక మంచి మనిషి కన్నీరు పెట్టడం దేశానికి మంచిది కాదేమో! అయినా… ఏడవాల్సింది ఆంటోనీ కాదేమో! నేటి రాజకీయాలను చూసి మనమంతా ఏడవాలేమో!

‘మీ నిబద్ధతపై మాకెలాంటి సందేహాలూ లేవు. రక్షణ శాఖను ప్రక్షాళన చేస్తే.. మేమూ మీకు అండగా ఉంటాం!’
– ఆంటోనీని ఉద్దేశించి అరుణ్ జైట్లీ

ప్రకటనలు

12 Comments

 1. హహహా… ఈ మాత్రానికే కాళ్ళు మొక్కుతారా.. చెడుని నిరోధించలేని వాళ్ళు బాధ్యత లలో ఉంటే ఏమనాలి..అసమర్ధులు అంటాం.. ఏడిస్తే జరిగిన నష్టం పూడుతుందా.. బుగ్గ కారు కోసమో, ప్రతిష్ఠలకోసమో పదవులెక్కేవాళ్ళు.. ఏడవక ఏం చేస్తారు.. అప్పుడెప్పుడో తెలంగాణ మీద వ్యతిరేఖం గా వ్రాస్తే ఏంటో అనుకున్న.. ఇదన్న మాట మీ స్వరూపం..

 2. ఒక లక్షా యబై వేల కోట్ల రూపాయలు మెక్కేసి….
  ప్రజలకు బిస్కెట్లు విసిరేసినట్లు నాలుగు సంక్షేమ పధకాలతో దేముడు అనిపించుకునే నాయకులకన్నా….
  ఈయనే బెటర్ అనిపించింది….యామై రాంగ్..??

 3. ఏడ్వక ఏంచేస్తారు? ఆర్మీ చీఫ్ పిర్యాదు చేసినా ఏమీ ఆక్షన్ తీసుకోలేదు. పైగా చెప్పిన ఆర్మీ చీఫ్నే కంప్లైంట్ చేసుకోమని ఉచిత సలహా పారేశారు. ఎందుకు? ఆ లాబీలంతా బోఫోర్స్ కాంగ్రెస్ బ్రోకరు గణం కాబట్టి. ఆర్మీ చీఫ్ను రాతపూర్వకంగా ఇవ్వమని ఆదేశించి, ఈయన ఎందుకు దర్యాప్తుకు ఆదేశించలేదు? ఈమాట నిలదీసినందుకే నేను నిజాయతీ అని గొల్లుమని వుంటాడు. నిజాయతీ ఒక్కటే కాదు, పనితనమూ వుండాలి. ఆ మాత్రానికి ఏ బండను ఆ సీట్లో కూచోబెట్టినా నిజాయతీగా వుండగలదు.

 4. /ప్రజలకు బిస్కెట్లు విసిరేసినట్లు నాలుగు సంక్షేమ పధకాలతో/
  ప్రజలంటే ఈ పచ్చ పార్టీ అభిమానులకి ఎంత చులకన భావం..ప్రజలని కుక్కలతో పోల్చిన నీ లాంటి వాళ్ళని ,నీ కుల పార్టీ అయిన తెలుగు దేశాన్ని ప్రజలు తిరస్కరించడం లో పెద్ద ఆశ్చర్యం అనిపించదు. మీ కుల పార్టీ మొన్న కొవ్వుర్ ఎన్నికల్లో నలభయ్ కోట్లు పంచింది. ప్రజలేమో మీ లాంటి అవినీతి కుక్కల్ని, కుహన అవినీతి పార్టీ లని చెప్పుకి పెంట రాసి కొట్ట్టారు. అయినా మీకు సిగ్గు రాదు. మీ డబ్బా పార్టీ ,కుల,అవినీతి పార్టీ అతి త్వరలో మూత పడుతుంది. అప్పుడయిన ఈ కుల గజ్జి ఎదవలకి సిగ్గు వస్తుందో లేదో !!!!

 5. నేను మొదటి నుండీ చెబుతూనే వస్తున్నా…ఏ పార్టీ వారినైనా అవినీతి విషయంలో వ్యత్తిరేకించాలిసిందే…..అది టీడీపీ అయినా…బీజేపీ అయినా..అంతే గానీ బాబు దొబ్బుకు తిన్నాడు గాబట్టి ….జగనూ తిన్నాడు..కాబట్టి చెల్లుకు చెల్లు అన్న పద్ధతి మంచిది కాదూ అనీ………కానీ నీ మూర్ఖత్వం నాకు నచ్చింది హజారే…నీ లాంటి వాళ్ళు ఉండ బట్టే లక్షల కోట్లు బొక్కేసిన జగనైనా…కోంచెం తక్కువ మెక్కిన బాబైనా జనాల్లో వెలిగిపొతున్నారు

 6. అన్నా హజారేని హీరో అనుకుంటూ అతని పేరు పెట్టుకునేవాళ్ళు అన్నాకి ఎంత కులగజ్జి ఉందో తెలుసుకుంటే మంచిది:
  http://hindi.oneindia.in/news/2011/12/12/haryana-anna-hazare-crossed-limit-agarwal-community-aid0147.html
  అన్నా హజారే ప్రభుత్వాన్ని “కోమటి” అని అంటూ వైశ్య కులంవాళ్ళని కించపరిచాడని కొన్ని రాష్ట్రాలలో వైశ్యులు గొడవ చేశారు.

 7. ఈ వార్తలు ఏ తెలుగు మసాలా పత్రికలలోనూ రావు. ఈ వార్తలు వ్రాస్తే అన్నా హజారే లాంటి మాస్ హీరోల అభిమానులు తమ పత్రికలు చదవరని ఆ మసాలా పత్రికల ఎడిటర్‌ల భయం.

 8. ప్రపంచ బ్యాంక్ అప్పులతోనే కదా కాంగ్రెస్ ఆ సంక్షేమ పథకాలు పెడుతోంది. ఆ అప్పులు తీర్చలేకపోతే ప్రజా సంక్షేమానికి వ్యతిరేకమైన పన్ను పోట్లు పెంచి ఆ పన్నుల డబ్బులతోనే అప్పులు తీరుస్తారు. కుడి చేతితో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేతితో ఇరవై రూపాయలు లాక్కుంటారు.

 9. పన్ను పోటు ఇలా అలా ఉందంటారా??ఒక్క మునిసిపాలిటీల్లోనే చుక్కలు చూపిస్తున్నారు…సర్వీస్ టాక్స్ అంటూ ఎడాపెడా బాదేస్తున్నారు..కారు తీయాలంటే…గుండె కలుక్కు మంటోది..డబ్బైరెండు రూపాయల పైగా లీటరుకు వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వం సిగ్గు పడాలి..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s