ఓ మంచి డాక్టర్ గారు…


పేదల పెన్నిది ఈ డాక్టర్‌ హార్ట్‌

గుండెజబ్బుతో బాధపడేవారి బాధలు అర్ధం చేసుకుని తగిన చికిత్సతో వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారు పేదల పెన్నిది డాక్టర్‌ దేవీ ప్రసాద్‌ షెట్టి. బెంగుళూరులోని నారాయణ హృదయాలయా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాక్‌ సైన్సెస్‌లో ప్రసాద్‌ తన బృందంతో కలిసి రోజూ కనీసం 24 సర్జరీలు చేస్తుంటారు. మన దేశంలోనేగాక మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాల్లోనూ ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. వారంతా ఆయన్ను ‘డాక్టర్‌ హార్ట్‌’ అని పిలుస్తుంటారు. బెంగుళూరులో ఆయన ఆస్పత్రిలో ప్రపంచంలోకెల్లా పెద్ద పీడియాట్రిక్‌ విభాగం కలిగింది. డాక్టర్‌ ప్రసాద్‌ పనితీరుపై కేస్‌ స్టడీ గురించి హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో వాణిజ్యవేత్తలు తెలుసుకునే వుంటారు.

మొత్తం వెయ్యి పడకల నారాయణ హృదయాలయను 1600 కోట్లతో 2002లో నెలకొల్పారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి చికిత్సకైనా పేషెంట్లు సొమ్ము చెల్లించగలిగే స్థాయిలో వుంటే సరే, లేకుంటే ఉచితంగానూ వైద్యసేవలు అందిస్తారు. దేశంలో రోజూ జరిగే గుండె చికిత్సల్లో 10 నుంచీ 12శాతం ఈ ఆస్పత్రిలోనూ, కోల్‌కతా లోని డాక్టర్‌ ప్రసాద్‌ ఆస్పత్రిలోనే జరుగుతూండటం విశేషం. వచ్చే ఐదేళ్లలో 70 సర్జరీలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డాక్టర్‌ ప్రసాద్‌ అన్నారు.

యశస్విని…
దేశంలో ఆరోగ్య హీనతను తగ్గించడానికి ఆయన ఎన్నో గొప్ప స్కీములు ప్రవేశపెట్టారు. ఐదేళ్ల క్రితం ఆయన ‘యశస్విని’ అనే ఆరోగ్య పథకం రూపొందించారు. కొద్దిపాటి ప్రభుత్వ మద్దతుతో ప్రారంభించిన ఈ పథకం పేదలకు ఎంతో ఉపకరిస్తుంది. పేద కుటుంబాలకు చెందినవారెవరైనా ఈ ఇన్‌స్యూరెన్స్‌లో నెలకు కేవలం పది రూపాయలతో చేరవచ్చు. గత ఏడాది పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్‌లో రవ్వంత ఈ ఆరోగ్య పథకానికి వినియోగించే వీలు కలిగింది. దీంతో వేలాదిమందికి ఆరోగ్య పథకాలు, ఇన్‌స్యూరెన్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

ఆ రాష్ట్రంలోని నాలుగు వేలమంది స్కూల్‌ టీచర్లు నెలసరి ఆరోగ్య ఖర్చులకు వందరూపాయలు పొందుతున్నారు. నిజానికి వంద రూపాయలతో ఏమి వస్తాయి? కనీసం ఆంటీబయాటిక్స్‌ కూడా రావు. ఆ సమయంలో టీచర్లు వారి అలవెన్స్‌ను నేషనల్‌ ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీకి చెల్లించే విధంగా డాక్టర్‌ ప్రసాద్‌ షెట్టి తన పథకాన్ని సమర్పించారు. దీంతో వారు సంవత్సరానికి లక్షా 60వేలమేరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకునే వీలు పొందారు.

ప్రభుత్వం అదనంగా ఒక్క నయాపైసా ఖర్చుపెట్టనవసరం లేకుండా సుమారు రెండు మిలియన్ల మంది ఉత్తమ ఆరోగ్య వసతులు అందుకోగల్గుతున్నారని డాక్టర్‌ ప్రసాద్‌ షెట్టి అన్నారు. దేశంలో ప్రతీ ఆస్పత్రిలోనూ సరయిన వసతులు ముఖ్యంగా బెడ్స్‌, డాక్టర్లు ఇతర మౌలిక వసతులు సక్రమంగా తగిన సంఖ్యలో ఉంటే ప్రతీ ఒక్కరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించవచ్చని డాక్టర్‌ షెట్టి అభిప్రాయం. దేశంలో ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు 90శాతం నిరుపేదలు కావడంతో వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపనపుడు బడ్జెట్‌ కేటాయింపులు, పథకాలు రూపొందించుకోవడం వ్యర్ధమన్నారు.

హెల్త్‌ సిటీలు…
దేశంలో పేదల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచాలంటే ప్రతీ రాష్ట్ర రాజధానిలోనూ హెల్త్‌ సిటీ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో డాక్టర్‌ ప్రసాద్‌ షెట్టి ఒక భారీ పథకం రూపొందించారు. వైద్యరంగంలో ఉన్నవారికి భారీ శిక్షణా సౌకర్యాలతో శిక్షణా సంస్థలను వాటికి అనుసంధానం చేయడం అవసరంగా భావించారు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ఆలోచన సాకారమైతే దేశంలో ఆరోగ్యవంతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నారాయణ హృదయాలయ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఎఐజి, జెపి మోర్గాన్‌ సంస్థలు సుమారు 400 కోట్లు భాగస్వామ్యంతో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు అహ్మదాబాద్‌, జైపూర్‌, బెంగుళూరు, భువనేశ్వర్‌, డెహ్రాడూన్‌లలో పెద్ద ఎత్తున ఆస్తులను అందజేయడానికి పూనుకున్నాయి. ఈ మహోన్నత ఆశయ ఫలానికి దేశంలో ప్రైవేట్‌ రంగం విస్తరించితే తప్పకుండా వచ్చే అయిదేళ్లలో మరో 20వేల పడకలు ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు డాక్టర్‌ షెట్టి.

వ్యక్తిగతం…
పేరు : డాక్టర్‌ దేవీ ప్రసాద్‌ షెట్టి
జన్మస్థలం : కిన్నిగోలి, దక్షిణ కనరా జిల్లా, కర్ణాటక
విద్య : జనరల్‌ సర్జరీ, కస్తూరిబా కాలేజ్‌, మంగుళూరు,
కార్డియాక్‌ సర్జరీ గేస్‌ హాస్పిటల్‌(ఇంగ్లాండ్‌)
విదేశాల్లో : వెస్ట్‌మిడ్‌లాండ్స్‌లో రొటేషన్‌ పద్దతిలో
పనిచేశారు.
స్వదేశంలో: 1989లో విదేశాల నుండి తిరిగివచ్చాక కోల్‌కతా బిర్లా ఆస్పత్రిలో పనిచేశారు. బెంగుళూరు వచ్చి మణిపాల్‌లో హార్ట్‌ ఫౌండేషన్‌ నెలకొల్పారు.
2002లో బెంగుళూరులో నారాయణ హృదయాలయా
నెలకొల్పారు.

అవార్డులు…
* 2005లో ష్వాబ్‌ ఫౌండేషన్‌ అవార్డు
* 2004లో పద్మశ్రీ
* 2003లో డాక్టర్‌ బి.సి.రాయ్‌ అవార్డు
* 2001లో కర్ణాటక రత్న
[సూర్య దిన పత్రిక ఆదివారం అనుబందమ్ నుండి…]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s