జస్టిస్ బాలకృష్ణన్…


నా అభిమాన జస్టిస్ భాలకృష్ణన్ గురించి మీకు కొన్ని విశేషాలు..


సుప్రీం హీరో జస్టిస్‌ బాలకృష్ణ

దళిత కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం ఆయన… తన సంచలనాత్మక తీర్పులతో న్యాయవ్యవస్థలోనే ఒక సమున్నత వ్యక్తిత్వమున్న ఉన్నత న్యాయాధికారిగా ఖ్యాతినార్జించారు. యావత్‌ భారతావనికే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తిగా… ఆ పదవికే వన్నెతెచ్చిన వ్యక్తిగా చెప్పదగిన జస్టిస్‌ కేసీ బాలకృష్ణన్‌.

ఆయన కృషి వెనక అంతులేని కసి ఉంది… ఆ కసే ఆయనను మహోన్నత రుషిగా మలిచింది… న్యాయమూర్తులు ఎందరు వచ్చినా… ఎందరు వెళ్లినా… బాలకృష్ణన్‌ బాణీ ప్రత్యేకత సంతరించుకుంది… గవర్నర్‌ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగివుండాలన్నా… నిందితుల ఒప్పందం లేనిదే వారిపై నార్కో అనాలసిస్‌ టెస్ట్‌లు చెల్లనేరవని తీర్పు చెప్పినా… అంబానీ సోదరుల విషయంలో కేజీ గ్యాస్‌ ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాధికారం ప్రభుత్వానిదే అని తీర్పు చెప్పినా… పౌరహక్కులకు భంగం కలిగించే బంద్‌లు, హర్తాళ్లు జరిపించే రాజకీయపార్టీల గుర్తింపును రద్దుచేయాలని ఎన్నికల కమిషనర్‌కు సూచించినా ఆయనకే చెల్లింది… ఈ నెల 11న సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తిగా పదవీవిరమణ చేయబోతున్న బాలకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్‌లో మరికొందరు న్యాయమూర్తులు భారత రాజ్యాంగ విలువలను గుర్తిస్తూ… ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి… భారత అత్యున్నత న్యాయకీర్తి పతాకాన్ని దశదిశలా ఎగురవేయాలని భారత ప్రజల ఆకాంక్ష….

కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో మారుమూల కుగ్రామం అయిన తాలయోలపరంబులో మే 12, 1945 సంవత్సరంలో గోపినాథన్‌, శారద దంపతులకు కొనకుప్పకటిల్‌ బాలకృష్ణన్‌ జన్మించారు. బాలకృష్ణన్‌ పులయా అనే దళిత కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం… బాలకృష్ణన్‌ బాల్యంలో కేరళలోని గ్రామాలలో కులవ్యవస్థ జడలు విప్పి విస్తరించింది… దళితులంటే అందరికీ చిన్నచూపే… ప్రత్యేకంగా పులయా కులం అంటే కేరళలో ఉన్న అన్ని దళిత కులాలలో వెనకబడిన కులం అది. కొన్ని పాఠశాలలలో దళితులకు ప్రవేశమే ఉండేది కాదు… దళితులు ఉన్నత చదువులు చదువుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. సమాజంలో డబ్బు, హోదా, పలుకుబడి, అగ్రకులం వంటి అంశాల ప్రభావం బాగా ఉండేది…అటువంటి క్లిష్టపరిస్థితులలో బాలకృష్ణన్‌ చదువుమీద వ్యామోహంతో తన ఉన్నత లక్ష్యానికి పేదరికం…కులం అడ్డుగోడలు కావనుకున్నాడు… ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా ధైర్యంగా ఎదిరిచ్చి నిలబడ్డాడు… అవమానాలు తన గుండె పొరల్లో ఆణిచేసుకుని తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాడు…

కన్నకలలు సాకారం చేస్తూ… తండ్రి గోపినాధన్‌ చదివింది అప్పట్లో మెట్రిక్యులేషన్‌ మాత్రమే… అదే తన బంధువర్గంలో ఎక్కువ చదువు ఆ రోజుల్లో… చదువును మెట్రిక్యులేషన్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టేసి కోర్టులో బంట్రోతుగా జీవితాన్ని ఆరంభించి క్లర్కుగా ఎదిగాడు. భారత మాజీ రాష్టప్రతి కేఆర్‌ నారాయణన్‌కు గోపినాధన్‌ బాల్యమిత్రుడు. ఇద్దరూ ఒకే ప్రాంతం వారు కావడం విశేషం. తల్లి శారద ఏడవ క్లాసుదాకా చదువుకుని మధ్యలోనే చదువు ఆపేసింది. బాలకృష్ణన్‌ చదువుమీద చూపించే శ్రద్ధ అంతాయింతా కాదు. చదువుకోసం పాఠశాలకు ప్రతిరోజూ సుమారు 5 కి.మీ.కు పైగా దూరం నడిచి వెళ్లి నడిచి వచ్చేవాడు. తల్లిదండ్రులు కూడా చదువు విషయంలో బాలకృష్ణన్‌ను ఎంతగానో ప్రోత్సహిం చేవారు…తమ బిడ్డ ఏనాటికైనా ఏ లాయరో, జడ్జో అవుతాడని కలలు కన్నారే తప్ప… సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవిని అలంకరిస్తాడని ఏనాడూ కనీసం కలగనలేదు. కన్నవారి కలలను సాకారం చేస్తూ బాలకృష్ణన్‌ దేశంలోనే అత్యున్నత పదవి అయిన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేశారు.

విద్యాభ్యాసం:
గ్రామంలోని గవర్నమెంట్‌ స్కూల్లో ప్రైమరీ విద్య అనంతరం ఎర్నాకుళంలోని మహరాజాస్‌ కాలేజీలో చేరాడు. అక్కడ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ పూర్తిచేశాడు. తర్వాత న్యాయ విద్యపై మక్కువతో అదే కాలేజీలో బిఎల్‌ పూర్తిచేశాడు. 1968లో కేరళ బార్‌ కౌన్సిల్‌లో ఎడ్వకేట్‌గా తన పేరును నమోదు చేయించుకున్నాడు. 1970 సంవత్సరంలో ఎల్‌ఎల్‌ఎమ్‌ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. 1973లో కేరళ జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో మున్సిఫ్‌గా నియమించబడ్డాడు. ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి కేరళ హైకోర్టులో స్వతంత్ర లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ‘సమాజానికి జడ్జి, లాయరు ఇద్దరూ కావాలి… వారికి సంఘంలో సమాన గుర్తింపు, గౌరవం ఉన్నాయి. సామాన్య ప్రజలు ఈ ఇద్దరినీ కూడా గౌరవిస్తారు’ అని లాయర్‌, జడ్జి సంబంధం గురించి ఎప్పుడూ చెబుతుండేవారు బాలకృష్ణన్‌.

బందులపై సంచలనాత్మక తీర్పు:
1985 సంవత్సరంలో కేరళ హైకోర్టు జడ్జిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత 1997 సంవత్సరంలో గుజరాత్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 1998లో గుజరాత్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యారు. కొంతకాలం మద్రాస్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా చేశాక… జూన్‌ 8, 2000 సంవత్సరంలో సుప్రీం కోర్టు జడ్జిగా నియమించబడ్డారు. న్యాయమూర్తిగా బాలకృష్ణన్‌ ఇచ్చిన సంచలనాత్మక తీర్పులు ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి. కేరళలో న్యాయమూర్తిగా చేసేటప్పుడు తరచుగా రాజకీయ పక్షాలు ఇచ్చిన బంద్‌ పిలుపుతో ప్రజా జీవితం స్తంభించిపోయేది. చిరు వ్యాపారులు నష్టపోయేవారు. పిల్లల చదువులు, పెద్దవాళ్ల ఉద్యోగాలకు అన్నింటికీ ఆటంకం ఏర్పడటం చూసి చలించిపోయిన జస్టిస్‌ బాలకృష్ణన్‌ అప్పటి ఎలక్షన్‌ కమిషనర్‌కు సూచిస్తూ ఇలా బంద్‌లు, హర్తాళ్లు పేరిట ఎవరైనా రాజకీయ పక్షాలు పిలుపిచ్చినట్లయితే అటువంటి రాజకీయ పక్షాలను ఎన్నికల్లో పాల్గోనీయకుండా బహిష్కరించాలని… అవసరం అయితే ఆ పార్టీ గుర్తింపును సైతం ఎన్నికల కమిషనర్‌ రద్దు చేయాలని బాలకృష్ణన్‌ కోరారు.

అప్పట్లో రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎన్నో రకాలుగా గొడవలు చేశారు. అయినా బాలకృష్ణన్‌ ఏ ఒక్క పార్టీకి తలొగ్గకుండా… తన తీర్పుకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ప్రజా, పౌర హక్కులకు ఏ ఒక్కరు భంగం కలిగించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 2007 జనవరి 14న అప్పటి భారత రాష్టప్రతి అబ్దుల్‌ కలామ్‌ చేతులమీదుగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టీస్‌గా పదవీ స్వీకారం చేశారు.

కొన్ని వివాదాంశ తీర్పులు:
జస్టిస్‌ నిర్మల్‌యాదవ్‌ కేసుకు సంబంధించిన తీర్పులో జస్టిస్‌ బాలకృష్ణన్‌ను హర్యానా, చండీఘర్‌ బార్‌ కౌన్సిల్‌ తప్పుపట్టింది. మరో సంచలనాత్మక రేప్‌ కేసులో జస్టిస్‌ బాలకృష్ణన్‌ ఈ విధంగా తీర్పుచెప్పారు. ‘రేప్‌ కేసుల విషయంలో నిందితుడిని శిక్షించడం ఒక్కటే మార్గం కాదు… బాధితురాలు ఒప్పుకుంటే ఆమెతో అతనికిచ్చి పెళ్లి చేయవచ్చు. ఒక వేళ అతని వలన ఆమె సంతానం పొందినట్లయితే ఆ బిడ్డకు అతడు తండ్రిగా కూడా ఆమె ఇష్టప్రకారం ఉండవచ్చు… ’ అని ఆయన చేసిన వ్యాఖ్యలతో అనేక మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తప్పుపట్టాయి.

ఇటీవల ఇచ్చిన సంచలనాత్మక తీర్పులు:
ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న సంచలనాత్మక తీర్పులకు గత వారంలో జస్టిస్‌ బాలకృష్ణన్‌ నేతృత్వంలో వచ్చిన తీర్పులతో యావత్‌ భారతదేశం అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అంబానీ సోదరుల వివాదం:
కేజీ గ్యాస్‌ వ్యవహారంలో సర్కార్‌దే తుది నిర్ణయాధికారం అని సంచనలాత్మక తీర్పునిచ్చారు. నాలుగేళ్లుగా అంబానీ సోదరుల మధ్య కొనసాగుతున్న గ్యాస్‌ వివాదానికి సుప్రీం తీర్పుతో తెరపడింది. సహజవాయువు వినియోగం, విక్రయంపై నిర్ణయాత్మకమైన అధికారం కేవలం అక్కడి ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని తీర్పుచెప్పి సామాన్య ప్రజానీకానికి ఊరటనిచ్చింది. దీనితో మన రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ఇకపై పైప్‌ లైన్ల ద్వారా గ్యాస్‌ సరఫరా ప్రక్రియ వేగవంతం అవుతుంది. అలాగే గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలకు ఏ ఏ కంపెనీకి ఎంతెంత వాటా ఇవ్వాలనేది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

నార్కో అనాలసిస్‌ టెస్ట్‌లపై తీర్పు:
దేశంలో సంచలనం సృష్టించిన ఏ కేసు తీనుకున్నా… అందులో నిందితులకు నార్కో ఎనాలసిస్‌ టెస్ట్‌లు జరిపినవే ఎక్కువ. మన రాష్ట్రానికి సంబంధించి సత్యం రామలింగరాజు కేసు నుంచి ఇటీవల సంచలనం సృష్టించిన నాగవైష్ణవి కేసులోనూ నిందితులపై పోలీసులు నార్కో టెస్ట్‌లు బలవంతంగా జరపడం ఆనవాయితీ అయిపోయంది. కాగా నార్కో, పాలిగ్రాఫ్‌ టెస్ట్‌లు రాజ్యాంగ విరుద్ధమని… అవి హక్కుల అణిచివేతకిందకి వస్తాయని జస్టిస్‌ బాలకృష్ణన్‌ నేతృత్వంలో ఇటీవల సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. పోలీసులకు వారు పట్టుకున్న కేసులో ఏ మాత్రం పురోగతి సాధించాలన్నా… బ్రెయిన్‌ మ్యాప్‌, నార్కో, పాలిగ్రాఫ్‌ వంటి టెస్ట్‌లు తప్పనిసరిగా అనుసరిస్తున్నారు. కేసు దర్యాప్తుకు పాటించే కనీస పద్ధతులు పాటించకుండా నిందితుల ప్రమేయంలేకుండా టెస్ట్‌లు నిర్వహించ కూడదని తీర్పునివ్వడంతో పోలీసు అధికారులు కంగుతిన్నారు.

గవర్నర్ల వ్యవస్థపై:
ప్రభుత్వాలు మారడంతోనే గవర్నర్ల వ్యవస్థ కూడా మారిపోకూడదని… గవర్నర్లు ప్రభుత్వానికి గులాంగిరీ చేయలేదని వారిని తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌కు ఎంపికైన మెరిట్‌ విద్యార్థులలో రిజర్వుడు కేటగిరీకి చెందిన వారు ఉద్యోగాల ఎంపికలో వారి కోటాను ఉపయోగించుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. ప్రస్తుతం యూపీఎస్సీ పాటిస్తున్న ‘ఈ 16 (2)’ నిబంధనలకు రాజ్యాంగపరమైన చెల్లుబాటు ఉందని, ఇది అన్యాయాన్ని అరికట్టడంతోపాటు రిజర్వుడు కేటగిరీలోని మెరిట్‌ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతుందని చెప్పింది.

వ్యక్తిగతం
పూర్తిపేరు : కొనకుప్పకటిల్‌ గోపీనాథన్‌ బాలకృష్ణన్‌
పుట్టినతేది : మే 12, 1945
జన్మస్థలం : తాలయోలపరంబు, కొట్టాయం జిల్లా, కేరళ
తల్లిదండ్రులు : శారద, గోపినాథన్‌
విద్యార్హత : బి.ఎస్సీ, ఎల్‌.ఎల్‌.ఎమ్‌ (1971)
ప్రస్తుత హోదా : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (37వ)
పదవీకాలం : జనవరి 14, 2007 నుండి కొనసాగుతున్నారు
ప్రత్యేకత : భారత తొలి దళిత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.

సూర్య తెలుగు దిన పత్రిక..ఆదివారం..

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s