ఈ ప్రదేశాలు చూడకండి..


ఈ ప్రదేశాలు చూడొద్దూ..అంటున్నారు
ఆంద్రభూమి ఆదివారం స్పెషల్ లో..
డేంజర్స్?-ప్రవవి
April 18th, 2010

ఎప్పుడెప్పుడు ఏయే ప్రాంతాలకు వెళ్లాలా? అని ప్రణాళికలు గీసుకునే ప్రపంచ పర్యాటకులకు ఓ అశుభవార్త. ప్రపంచంలో అతి చెత్త ప్రదేశాలు, జీవితంలో ఎప్పటికీ చూడకూడని ప్రాంతాలూ కొన్నున్నాయి. అక్కడకెళ్లి కష్టాలు కొని తెచ్చుకునే కంటే, వెళ్లక పోవడమే మంచిది. అయితే, ఆసక్తి రేకెత్తించే వాటిగురించి తెలుసుకోవడం ఇంకా మంచిది. అవేంటంటే…
విష విలాసం -పసిఫిక్ దూగర శిఖరం
శిఖరం అనగానే ఎతె్తైన కొండ ప్రదేశమో, ఎక్కడానికి అవకాశం లేని శిఖర ప్రాంతమో అనుకోవద్దు. కంటికి కనిపించని విష పదార్థాలు నీటిపై కట్టేసిన తెట్టే -దూగర శిఖరం. మహా సముద్రాల్లో అతి పెద్దదైన పసిఫిక్‌కు ఇదొక మాయని మాసిక. అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన ప్రదేశం. మహా సముద్రం ఉత్తర ప్రాంతంలో 135 నుంచి 155 డిగ్రీల కోణంలో పశ్చిమాన కనిపించే కాలుష్య కాసారమే -గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ పాట్చ్. విస్తీర్ణంలో యుఎస్‌లోని టెక్సాస్ దేశం కంటే ఇది పెద్దది. కాంటినెంటల్ యునైటెడ్ స్టేట్స్ కంటే కాస్త చిన్నది అని అంచనా. ఉత్తర పసిఫిక్ గైర్‌నుంచి కొట్టుకొచ్చే ప్లాస్టిక్, రసాయినాల బురద ఇలా తెట్టులా పేరుకుని విషపూరిత దూగర శిఖరమైంది. ప్రాణాల మీద ఆశ వదలుకుంటేనే, దూగర శిఖరం ఎలా ఉంటుందో చూడ్డానికి వెళ్లాలి.
నిప్పుతో ముప్పు -ఇజూ ద్వీపాలు:
తెలిసి పెట్టినా, తెలీక పెట్టినా నిప్పుమీద కాలుపెడితే తోలు ఊడిపోవడం ఖాయం. ఎందుకంటే -మండటం నిప్పు గుణం కనుక. ఇజూ ద్వీపాల్లోకి అడుగు పెట్టడం అంటే -నిప్పుమీద కాలు పెట్టడమే. ఎందుకంటే, ఇవన్నీ భగభగమండే అగ్ని ద్వీపాలు కనుక. జపాన్‌లోని హోన్షుకు సమీపంలో దక్షిణం నుంచి తూర్పుకు విస్తరించివున్న ఇజూ ద్వీపకల్పంలోని భాగమే -ఇజూ ద్వీపాలు. వాస్తవానికి ఇజూ ద్వీపాల్లో రెండు పట్టణాలు, ఆరు గ్రామాలు ఉన్నా, పాలనాపరంగా అవి టోక్యో పరిధిలోకి వస్తాయి. ఇందులో అతి పెద్దది ఇజూ ఓషిమా. అగ్నిపర్వత ప్రాంతమైన ఈ ద్వీప పర్యావరణమంతా అత్యంత ప్రమాదకరమైన సల్ఫర్ వాయువు కమ్ముకుని ఉంటుందట. ఎప్పటికైనా ప్రమాదమేనని గుర్తించి ఇక్కడి ప్రజల్ని 1953లోనే వేరేచోటికి తరలించి పునరావాసం కల్పించారు. 2000 వరకూ ఒక్క మానవ ప్రాణి కూడా ద్వీపంపైకి కాలు మోపలేదు. 2005 నుంచీ ప్రజలు మళ్లీ ద్వీపానికి తిరిగి రావడం ఆరంభించారు. గ్యాస్ మాస్క్ లేకుండా ఇక్కడ ఏఒక్కరూ కనిపించరు. ఎందుకంటే, ఏక్షణంలో సల్ఫర్ వాయువుస్థాయి పెరిగిపోతుందో, తగ్గుతుందో ఎవరికీ తెలీదు మరి. ఇప్పుడుచెప్పండి, మట్టికింద నిప్పుందని తెలిసీ పాదం మోపుతామా?
నరకానికి మహాద్వారం -టర్కెమినిస్తాన్
చూస్తూ చూస్తూ ఎవ్వరూ నిప్పుల గుండంలో కుప్పిగంతులు వేయాలని అనుకోరు. అలాంటిది, అగ్నికీలల ఉవ్వెత్తున లేస్తోన్న బిలంలోకి విహాయ యాత్రకు వెళ్తామా చెప్పండి. టర్కెమినిస్తాన్‌లోని డెర్వేజ్‌లోకి అడుగు పెట్టడమంటే, తెలిసి తెలిసి నిప్పుల కొలిమితో ఉప్పులగుప్ప ఆడినట్టే. 1971లో డెర్వేజ్ ప్రాంతంలో భూగర్భ శాస్తవ్రేత్తలు తవ్వకాలు జరుపుతుండగా ఒక్కసారిగా గ్యాస్ మంటలు పైకిలేచాయట. తవ్వకాల కోసం భూగర్భంలో ఏర్పాటు చేసిన డ్రిల్లింగ్ యంత్రం ఉన్నపాటుగా కుప్పకూలిందట. చూస్తుండగానే కళ్లమందు బిలం ఏర్పడింది. వంద మీటర్ల వ్యాసార్థానికి విస్తరించింది. అలా అప్పుడేర్పడిన బిలం నుంచీ ఇప్పటికీ మంటలు ఎగజిమ్ముతూనే ఉన్నాయి. విష పూరితమైన గ్యాస్‌ను వదిలేయడానికి శాస్తవ్రేత్తలు ఆ మంటను ఇంకా మండిస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల్లోనే మంటల తీవ్రత తగ్గే అవకాశం ఉన్నా, ఇది ఎప్పటికీ అలా మండుతూనే ఉంటుందని శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకే స్థానికులు ఈ అగ్ని బిలానికి -నరకానికి ముఖద్వారం అని పేరు పెట్టుకున్నార్ట.
ఆకుపచ్చని విషం -అల్నివిక్
పచ్చని చెట్లు ప్రాణం పోస్తాయని మనకు తెలుసు. కానీ, ఆల్నివిక్ గార్డెన్‌లోని ఆకులే కాదు, గడ్డిపరకలు తెంపి నోట్లో వేసుకున్నా ప్రాణం గుటుక్కుమనడం ఖాయం. ఎందుకంటే -ఆ గార్డెన్‌నిండా విషపూరితమైన చెట్లు, మొక్కలే ఉంటాయి మరి. 1500 సంవత్సరంలో ఇటలీలోని పాదువా గార్డెన్‌లో ఔషధ, విషపూరితమైన మొక్కలు పెంచేవారట. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి బొటానికల్ గార్డెన్. దీన్ని స్ఫూర్తిగా తీసుకునే ఆల్నివిక్ గార్డెన్‌లో ఆకుపచ్చని విషాన్ని పెంచిపోషిస్తున్నారు. కెన్నాబీస్, కోకాలాంటి అత్యంత విషపూరితమైన మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయట. కాకపోతే, వాటి కి ప్రత్యేక ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసి పెంచుతున్నారు. చిత్రవిచిత్రమైన వృక్షజాతులు, అననుకూల వాతావరణంలో సైతం రాక్షసంగా పెరిగిపోయే జాతుల్ని ఇక్కడ చూడొచ్చంటున్నారు నిర్వాహకులు. విషాన్ని గొంతులో దాచుకునే గరణకంఠులు తప్ప, సామాన్యులెవరూ ఇంగ్లాండ్‌లోని డెన్‌విక్ లైన్‌లో కనిపించే ఆల్నివిక్ గార్డెన్ ఆకుపచ్చని విషాన్ని కొరికి చూడాలని అనుకోరు.
ప్రాణాల్ని ‘పీచు’ పిప్పిచేసే -రాతి నార
చావడానికి ఎన్నో సులువైన మార్గాలు ఉన్నపుడు -కొన్నివేల ఉరితాళ్లు ఊపిరికి తగిలించుకుని భయానకంగా చావాలని ఎవరైనా అనుకుంటారా? అలా అనుకునే వాళ్లెవరైనా ఉంటే -కెనడాలో బార్లా తెరుచుకుని కనిపించే రాతినార గనుల్లోకి అడుగు పెట్టొచ్చు. సామాన్యుడు ఇంటి పైకప్పుగా వాడే ఆస్‌బెస్టాస్ రేకుల తయారీకి వినియోగించే ముడి పదార్థమే -రాతి నార. అగ్గిని, శబ్దాన్ని పీల్చుకునే విచిత్రమైన గుణం రాతి నారకు ఉంటుంది. అంతేకాదు, క్యాన్సర్ అంతకంటే ప్రమాదకరమైన వ్యాధులకు ఇది మూలమని కూడా తేలింది. అందుకే, యూరోపియన్ దేశాల్లో ఆస్‌బెస్టాస్ వాడకానే్న నిషేధించారు. కాకపోతే, కెనాడా క్యూబెక్ ప్రాంతంలో మాత్రం రాతినార గనుల్లో ఇప్పటికీ ఉత్పత్తి సాగుతోంది. థెట్‌ఫోర్డ్ రాతినార గనుల్లోకి అడుగు పెడితే, మన పీచు ఎలా వదిలిపోతుందో వెంటనే అర్థమైపోతుంది. అయితే, విచిత్రం ఏంటంటే ఈ గనుల్లో పని చేస్తున్న కూలీలు కనీసం శ్వాస సంబంధ మాస్క్‌ల జాగ్రత్తలు కూడా తీసుకోకుండానే పని చేస్తుంటారు పాపం. అత్యంత ప్రమాదకరమైన ఈ వాతావరణంలో విహరించేందుకు గనుల యాజమాన్యం ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తోంది కూడా. ఉత్తినే తీసుకెళ్లకపోతే, ప్రాణంతో చెలగాటం ఆడేందుకు ఎవరైనా టికెట్ కొనుక్కుంటారా చెప్పండి.
మొసళ్ల రాజ్యం -రామ్‌రీ ద్వీపం
బర్మాకు వెళ్ళినవాళ్లు రామ్‌రీ ద్వీపాన్ని చూడాలని అనుకుంటారు కానీ, చూడ్డానికి ఎవ్వరూ సాహసించరు. ద్వీపంలోకి అడుగు పెట్టడమంటే, నేరుగా మొసలి నోట్లోకి పాదం మోపడమే. అవునా! అని నోరు తెరిచేశారా. ఇక్కడి ఉప్పునీటి మొసళ్లు కూడా అలాగే 24 గంటలూ నోరు తెరుచుకునే ఉంటాయి మరి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉప్పునీటి మొసళ్లు ఇక్కడ వెయ్యి వరకూ ఉన్నాయట మరి. అంతేకాదు మలేరియాను వృద్ధిచేసే దోమలు, కాటు వేస్తే కాటికిపోయేంతటి విషపూరితమైన తేళ్లకు ఈ చిత్తడి నేలలు పురిటి గడ్డ అట. ఈ ద్వీపం ఎంత ప్రమాదం అని చెప్పుకోడానికి ఇక్కడ చిన్న వాస్తవిక పిట్టకథను ప్రస్తావించుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (్ఫబ్రవరి 19, 1945) కొంతమంది జపాన్ సైనికులు ఈ ద్వీపంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. ఉన్నన్నాళ్లూ కాళరాత్రిని ప్రత్యక్షంగా చూసిన సైనికుల అనుభవాలు వింటే పైప్రాణాలు పైనే పోతాయి. మొసళ్లు దాడి చేసి దొరికిన వాణ్ని దొరికినట్టు నంచేసుకోవడం, మిగిలిన చిన్నాచితకా శరీర అవయవాలు మిగిలిపోతే, తెల్లారకముందే వాలిపోయే ప్రమాదకరమైన రాబంధులు వాటిని తన్నుకుపోవడం ఇదీ వాళ్లు అక్కడ చూసింది. విషయం ఏంటంటే, వెయ్యిమంది ఆ ద్వీపంలోకి అడుగు పెడితే బయట పడింది కేవలం 20మందేనట. ఎంతమంది ఆహారమైపోయారో లెక్కలేసుకోండి.
వంకర టింకర మృత్యుమార్గం -యుంగస్ రోడ్
బొమ్మల్లో చూడ్డానికి, కథల్లో వినడానికి థ్రిల్లుగా ఉన్నా -ఈ రోడ్డుమీద ప్రయాణించే వాడు మాత్రం చెమటతో నిలువెల్లా తడిచిపోవడం ఖాయం. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యంత పెద్ద మృత్యుమార్గమిది. బొలీవియా యుంగస్ రీజియన్‌లోని లా పాజ్‌కు ఈశాన్య దిశగా 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘాట్ రోడ్డే -యుంగాస్. 61 కిలోమీటర్ల మేర ఉండే ఈ రోడ్డుపై సంభవించే ప్రమాదాల కారణంగా ఏటా కనీసం 300మంది కచ్చితంగా చనిపోతున్నారు. 1930లో పారాగ్యుయన్ ఖైదీలు నిర్వహించిన చాకో యుద్ధ సమయంలో ఈ రోడ్డు నిర్మాణం జరిగిందట. ఉత్తర బొలీవియాలోని అమెజాన్ వర్షాధార అడవులకు కలపబడే ఈ రోడ్డులోని కొన్ని పక్కదార్లు అత్యంత ప్రమాదకరమైనవి చెప్తారు. అత్యంత ఎతె్తైన కొండ ప్రాంతంలో నిర్మాణమైన ఈ రోడ్డుకు రెండోవైపు ఎలాంటి రెయిలింగ్సూ ఉండవు. అంతేకాదు విపరీతమైన మంచు, వర్షం, ఇరుకైన రోడ్డు కారణంగా ప్రమాదాలకు లెక్కే లేదు. ఘాట్ రోడ్డునుంచి పొరబాటున లోయలోకి జారితే వెతికి పట్టుకోడానికి కనీసం నాలుగైదు రోజులు పడుతుందంటారు స్థానికులు. అంతేకాదు రోడ్డంతా ఎప్పుడూ చిత్తడిగా ఉండటమే కాక, కొండరాళ్లు జారిపడి ప్రమాదం ఏరూపంలో, ఏ సమయంలో, ఏ మార్గంలో ముంచుకొస్తుందో చెప్పడం ఎవ్వరి తరం కాదన్నది ఈప్రాంత వాసుల బలమైన నమ్మకం. అందుకే -ఈరోడ్డు మీద అడుగు పెట్టడమంటే మృత్యువును కౌగిలించుకోవడమే.
గుండెలదరగొట్టే -అజెర్‌బయిజాన్
ఎక్కడైనా అగ్ని పర్వతం బద్దలైతే నిప్పులుగక్కే లావా బయటికొస్తుంది. కానీ, 2001లో కాస్పియన్ సముద్ర తీరం అజేరీ అడుగు భాగాన అగ్నిపర్వతం బద్దలై బురద బయటకొచ్చింది. అలా బయటికొచ్చిన బురదతో ఒక ద్వీపమే ఆవిష్కృతమైంది. విచిత్రం కదూ! అదృష్టవశాత్తూ తీరానికి దగ్గరలో మానవ నివాసాలు లేవు కనుక ఎలాంటి ప్రమాదాలూ సంభవించలేదట. ప్రపంచంలోనే ఇవొక విచిత్ర గుణం కలిగిన అగ్ని పర్వతాలు అంటున్నారు పరిశోధకులు. సముద్ర తీరం అడుగున కొన్ని వందల అగ్ని పర్వతాలు బద్దలవడం వల్ల ఇసుకతో కూడిన బరద బయటకు తన్నుకొస్తుందట. ప్రతి 20 ఏళ్లకోసారి ఇక్కడ ఇలాంటి అగ్ని పర్వతాలు బద్దలవుతూనే ఉన్నాయని గమనించారు. తీరానికి అడుగు భాగాన ఉన్న అగ్ని పర్వతం పెద్ద వత్తిడితో బద్దలైన ప్రతిసారీ ఆకాశంలోకి అగ్ని కీలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ మంటలు పదిహేను కిలోమీటర్ల దూరానికి కూడా కన్పిస్తున్నట్టు చెప్తున్నారు. ఒక్కసారి అగ్ని పర్వతం బద్దలైతే, కొన్ని వేల టన్నుల బురద బయటికొచ్చి సమీప ప్రాంతాలను ముంచేస్తుందట. అలా బయటికొచ్చి గడ్డకట్టిన బురదతోనే సముద్రంలో ద్వీపం ఏర్పడిందంటే ఆశ్చర్యమే మరి.
పాముల పుట్ట – ఇల్హా డే క్విమాడా
బ్రెజిల్ సముద్ర తీరంలోని ఓ ముఖ్య ద్వీప ప్రాంతమే -ఇల్హా డే క్విమాడా. సావోపోలోకు గుండెలాంటి ప్రాంతమిది. దీన్ని ద్వీపం అనేకంటే, చిత్తడి నేలల పాముల పుట్ట అనడం సహేతుకం. ఈ ద్వీపంలో చదరపు గజానికో పాము నివసిస్తున్నట్టు అధ్యయనవేత్తలు చెప్తున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని కావాలనే అభివృద్ధి చేయకుండా వదిలేశారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని చిత్రవిచిత్రమైన పాములన్నీ ఇక్కడే నివాసం ఉంటున్నాయి. అయితే, అన్ని పాములూ విషపూరితాలు కాదుంటున్నారు అధ్యయనవేత్తలు. రెండంగుళాల సైజులో ఉండే వానపాములాంటి ప్రాణుల నుంచి, విషాన్ని వెదజల్లి శత్రువు ప్రాణాలు తీసే లాన్స్‌హెడ్‌లాంటి ప్రమాదకరమైన పాముల వరకూ ఇక్కడ దర్శనమిస్తున్నాయట. బ్రెజిల్‌లో పాము కాటు కారణంగా సంభవించే మరణాల్లో 90 శాతం ఈ లాన్స్‌హెడ్ కారణంగానే అన్నది ఓ అంచనా. 50 సెంటీమీటర్ల సైజులో ఉండే ఈ పాము -విషాన్ని రెండు మీటర్ల దూరం వరకూ చిమ్మగలదు. విషం కనుక శత్రువు శరీరంపై పడితే మాంసమంతా కుళ్లిపోతుంది. అలా శత్రువు ప్రాణం గాల్లో కలిసిపోతుందట. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా చెప్పుకునే ఈ పాముల ద్వీపం మీదకు అడుగు పెట్టాలంటే అనుమతి తప్పని సరి.


ప్రకటనలు

2 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s