ఉత్తినే పెళ్లిగోల…


సానియా  పెళ్ళి ..మీడియా  గోల..మద్య  ఈ రోజు ..తోమ్మండ్రు సురేశ్ కుమార్..గారు ఆంద్ర జ్యోతి  ఆదివారం లో..ఆదర గొట్టేశారు…మన మీడియా ప్రజల్ని ఎంత వెర్రివెధవలుగా లెక్కకట్టిందో  స్పష్టం చేశారు…
ఉత్తినే…
పెళ్లి గోల

నమస్కారం! మీరు చూస్తున్నది టీవీ 925. సానియా మీర్జా పెళ్లిపై 20 రోజులుగా రాష్ట్రమంతటా నెలకొన్న హడావుడి మీకు తెలిసిందే. ఈ విశేషాలను మీ టీవీ 925 ఎప్పటికప్పుడు వేడి వేడిగా అందిస్తూ వచ్చింది. ఆయేషా సిద్దిఖీ వివాదం నుంచి షోయబ్ మాలిక్‌తో సానియా పెళ్లిదాకా వార్తలను కవర్ చేసిన మా రిపోర్టర్ రంగరాజా ఇప్పుడు ఫోన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. రంగరాజా! చెప్పండి! సానియా కవరేజ్‌లో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?’ అడిగింది న్యూస్ రీడర్.

‘మాలిని! ఒక్క ముక్కలో చెప్పాలంటే సానియా పెళ్లి మా చావుకు వచ్చింది మాలిని. నా సొంత పెళ్లికి కూడా నేను ఇంతగా హడావుడి పడలేదు మాలిని’… అన్నాడు రంగరాజా. (రిపోర్టర్ మూడ్‌తో పని లేకుండా ప్రశ్నలు సంధించే న్యూస్ రీడర్ ఈ విషయం పట్టించుకోలేదు.) ‘రంగరాజా! సానియా పెళ్లి లెహంగాను 4 లక్షల క్రిస్టల్స్‌తో తీర్చిదిద్దినట్లు వార్తలు వచ్చాయి. మీరు ఆ లెహంగాను చూశారా? నిజంగానే 4 లక్షల క్రిస్ట ల్స్ ఉన్నాయా? లేక ఇదంతా ఒట్టి పబ్లిసిటీ స్టంటా?’అడిగింది న్యూస్ రీడర్.

‘మాలిని! నేను లెహంగాను దగ్గరి నుంచి చూడలేకపోయాను. మీడియాను పెళ్లివేదికకు ఆమడ దూరంలో పెట్టారు. పెళ్లికూతురి దుస్తుల్లో కారులో వెళ్తున్న సానియా… కారు అద్దాల్లోంచి కనిపించీ కనిపించకుండా కనిపించింది. లెహంగాను తీసుకు వస్తున్నప్పుడు ఒకటి రెండు క్రిస్టల్స్ రాలిపోయినట్లు తెలిసింది … మాలిని!’ అని రంగరాజా చెప్పాడు.
‘రంగరాజా! మీరు చెప్పండి! పెళ్లి సందర్భంగా సానియా తన చేతులకు బ్రహ్మాండమైన మెహందీ డిజైన్ వేసుకున్నట్లు సమాచారం. ఆ డిజైన్ గురించి మీరేమైనా చెప్పగలరా?’ అడిగింది న్యూస్ రీడర్.
‘నిజమే మాలిని! గోరింటాకు డిజైన్ అదిరిపోయినట్లు మనకు అందిన సమాచారం. రిసెప్షన్‌లో సానియా ఒకసారి అరచెయ్యి పైకెత్తి అతిథులకు అభివాదం చేసింది. డిజైన్‌ను గుర్తించేందుకు మన కెమెరామాన్ ఫుల్‌గా ఫోకస్ చేశాడు. కానీ… మీడియాను ముందే చెప్పినట్లు ఆమడ దూరంలో ఉంచడం వల్ల, ఫుల్ జూమ్‌లోనూ మెహందీ డిజైన్ కనిపించలేదు. ఒక్కటి మాత్రం ష్యూర్… మెహందీ ఎరుపు రంగులోనే ఉంది.. మాలిని!’ చెప్పాడు రంగరాజా.

‘దిస్ ఈజ్ టూ బ్యాడ్ రంగరాజా! సానియా మెహందీ డిజైన్‌ను మన వ్యూయర్స్‌కు చూపించలేకపోవడం నిజంగా బ్యాడ్‌లక్. సరే ఇదైనా చెప్పండి రంగరాజా! పెళ్లి రిసెప్షన్‌లో సానియా నుదిటి మీద రెండు మూడు చెమట చుక్కలు కనిపించాయి. సానియా బాగా టెన్షన్ పడ్డారంటారా? వాటీజ్ యువర్ అబ్జర్వేషన్?” అడిగింది న్యూస్ రీడర్.
‘నిజమే మాలిని! మనం కెమెరా ఫుల్ జూమ్ చేసినప్పుడు సానియా నుదుటి మీద చిరుచెమటలు కనిపించాయి. దీనిపై మనం తర్వాత ఆరా తీశాం మాలిని! కాని సానియాకు ఎలాంటి టెన్షన్ లేదని, కాసేపు పవర్ పోవడంతో జనరేటర్ వేశారని, జనరేటర్ వేసినప్పుడు ఏసీలు పని చేయలేదని ఎలక్ట్రీషియన్ చెప్పాడు మాలిని! నిజానికి… ఆ టైమ్‌లో సానియా, షోయబ్‌లతోపాటు అక్కడున్న అందరికీ చెమటలు పట్టాయి మాలిని!’ చెప్పాడు రంగరాజా.

‘పెళ్లి విందు గురించి చెప్పండి రంగరాజా! వంటకాల్లో స్పెషల్స్ ఏమున్నాయి?” అడిగింది న్యూస్ రీడర్.
‘పెళ్లి విందులో ఐటమ్స్ సూపర్ మాలిని! అన్నం బియ్యంతో వండారు. స్వీట్స్‌లో షుగర్ వేశారు. చికెన్ కర్రీని కోడితో, మటన్ బిర్యానీని మేక మాంసంతో వండారు. అన్నింటికంటే ప్రత్యేకత ఏమిటంటే … పప్పులో ఉప్పు కూడా వేశారు! వంటకాలను ప్లేట్‌లో సర్వ్ చేశారు. అతిథులంతా నోటితో బాగా నమిలి మరీ మింగారు.. మాలిని’ చెప్పాడు రంగరాజా. (రంగరాజా గొంతులో వ్యంగ్యాన్ని, అసహనాన్ని న్యూస్ రీడర్ ఏమాత్రం పట్టించుకోలేదు.)

‘వావ్! పప్పులో ఉప్పు కూడా వేశారా! అయితే, సూపర్బ్‌గా ఉంటుంది రంగరాజా! నువ్వు చెబుతుంటేనే స్టూడియోలో ఉన్న నాకే నోరు ఊరుతోంది. ఇంతకీ అది ఏం పప్పు! మామిడికాయ పప్పా? నిమ్మకాయ పప్పా? చెప్పండి” అడిగింది మాలిని. ‘మాలిని… నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను. అది కచ్చితంగా కందిపప్పు! ష్యూర్… కందిపప్పే మాలిని!’ చెప్పాడు రంగరాజా. ‘విందు సందర్భంగా గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చారని తెలిసింది. రంగూ, రుచి వాసన లేని నీళ్లు సప్లయ్ చేశారంటూ కొందరు అతిథులు అలిగారని తెలిసింది! ఇది నిజమేనా… రంగరాజా’ అడిగింది మాలిని.
‘మాలినీ! మనం చిన్నప్పుడు చదువుకున్నాం. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండవని! అందుకే… కేటరింగ్ వాళ్లు ప్రత్యేక ఇంట్రెస్ట్‌తో రంగూ రుచీ వాసన లేని నీళ్లను సప్లై చేశారు మాలిని! ఈ విషయం తెలియని కొందరు అతిథులు మాత్రం అలిగినట్లు మనకు కూడా తెలిసింది మాలినీ!” చెప్పాడు రంగరాజా.

‘ఈ రోజు సానియా ఇంటి వద్ద వాతావరణం ఎలా ఉంది రంగరాజా!’ అడిగింది న్యూస్ రీడర్.
‘గంట క్రితమే నేను సానియా ఇంటి వద్దకు వెళ్లాను. వాళ్ల వీధి చివర మున్సిపాలిటీ చెత్తకుండీ పారేసిన విస్తరాకులతో నిండిపోయింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా వెళ్లిపోవడంతో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎలాంటి సందడి లేదు… మాలిని!’ చెప్పాడు రంగరాజా.
‘రంగరాజా… వాటె సర్‌ప్రైజ్! అక్కడ నిజంగా ఎలాంటి సందడి లేదా?’ అడిగింది న్యూస్ రీడర్.
‘సందడి లేదా అంటే… ఉంది మాలిని! డస్ట్‌బిన్ దగ్గర కుక్కల సందడి బాగా ఉంది మాలిని’ చెప్పాడు రంగరాజా.
‘అగైన్… వాటె సర్‌ప్రైజ్! అక్కడ కుక్కలు ఎందుకు హడావుడి చేస్తున్నాయి రంగరాజా’… అడిగింది న్యూస్ రీడర్.
‘ఊళ్లో పెళ్లి… కుక్కలకు హడావుడి అని ఒక సామెత ఉంది మాలిని’ అని చెప్పాడు రంగరాజా.
‘వావ్! రంగరాజా! చెప్పండి… కుక్క తోక వంకర అని కూడా ఒక సామెత ఉంది. నిజంగానే… కుక్కల తోకలన్నీ వంకరగానే ఉన్నాయా?’ అడిగింది న్యూస్ రీడర్.

‘నేను కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. నిజంగానే కుక్క తోకలన్నీ వంకరగా ఉన్నాయి మాలిని. నా ఫోన్‌లో చార్జింగ్ అయిపోతోంది.. మాలిని’ చెప్పేసి ఫోన్ పెట్టేశాడు రంగరాజా.
‘హలో.. హలో.. రంగరాజా! బ్యాడ్‌లక్… ఇప్పుడే మా రిపోర్టర్ ఫోన్ చార్జింగ్ అయిపోయింది. ఇక మరిన్ని వార్తల్లోకి వెళితే…’
– తొమ్మండ్రు సురేష్ కుమార్
tsuresh1974@gmail.com

ప్రకటనలు

6 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s